YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనకళ్ల నారాయణ కు టఫ్ ఫైటే

కొనకళ్ల నారాయణ కు టఫ్ ఫైటే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కృష్ణా జిల్లా కేంద్ర ప్రాంతం బందరు(మచిలీపట్నం)…పార్లమెంట్‌లో ఈ సారి టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. పోర్టు ఏర్పాటుతో పాటు సామాజికవర్గాల సపోర్ట్ లాంటి అంశాలే బందరు పార్లమెంట్‌లో గెలుపోటములు నిర్ణయిస్తాయి. ఇక గత రెండు పర్యాయాలుగా ఎంపీగా గెలిచి సత్తా చాటుతున్న కొనకళ్ళ నారాయణ మరోసారి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. అటు వైసీపీ అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి, జనసేన అభ్యర్ధిగా బండ్రెడ్డి రాము పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సారి బందరులో త్రిముఖ పోరు జరిగేలా కనిపిస్తోంది. 2009, 2014లో వరుసగా గెలిచి ఊపు మీదున్న కొనకళ్ళ నారాయణ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలుపొంది లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా పనిచేస్తున్న కొనకళ్లపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లస్ కానుంది.అలాగే ప్రత్యేకహోదా కోసం ఆయన పార్లమెంట్‌లో పోరాడిన తీరు ప్రజల్లో మంచి మార్కులే పడ్డాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన పార్టీ కోసం పని చేయడం వలన కార్యకర్తల్లో కూడా మంచి అభిప్రాయం వచ్చింది. సౌమ్యుడుగా ఉండటం వలనే బందరు పార్లమెంట్‌లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఎంపీ ఓటుని నారాయణకే వేస్తారని టాక్ ఉంది. అటు పోర్టు పనులు మొదలవ్వడం బందరులో టీడీపీకి ప్లస్ అవుతుంది. అయితే ఈ సారి ప్రభుత్వం మీదున్న కొంత వ్యతిరేకత…వైసీపీ బలపడటం…జనసేన పోటీలో ఉండటం లాంటి అంశాలు నారాయణకి మైనస్ కానున్నాయి.మరోవైపు వైసీపీ అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి గల్లా జయదేవ్ మీద ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ ఆయన్ని బందరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి…టికెట్ కూడా కేటాయించారు. ఎప్పటి నుండో బందరు పరిధిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేశారు. ఇక జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీ ఇక్కడ బలపడింది. అటు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులు కూడా స్ట్రాంగ్‌గా ఉండటం బాలశౌరికి ప్లస్ కానుంది. ఆర్ధికంగా కూడా బలంగానే ఉన్నారు. అయితే స్థానికేతరుడు కావడం మైనస్. తెదేపా అభ్యర్ధి నారాయణకి ఉన్న ఫాలోయింగ్ ఇక్కడ శౌరికి లేదు.ఇక జనసేన అభ్యర్ధిగా బండ్రెడ్డి రాము పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువ ఉండటం జనసేనకి కలిసిరానుంది. అయితే అపోజిట్ తెదేపా, వైకాపా అభ్యర్ధులు బలంగా ఉండటం జనసేనకి మైనస్ అవుతుంది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో బీసీలతో పాటు కాపులు కీలకంగా ఉన్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో కాపులు అధిక సంఖ్యలో ఉండగా పామర్రులో ఎస్సీలు హెచ్చుగా ఉన్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం, పెనుమలూరులో బీసీలతో పాటు కమ్మ సామాజిక వర్గం కీలకపాత్ర పోషిస్తున్నారు.అయితే బాలశౌరి, రాము కాపు సామాజికవర్గం చెందిన నేతలు కాగా, కొనకళ్ళ నారాయణ (బీసీ) గౌడ సామాజికవర్గం నేత. అటు కాపు సామాజికవర్గంలోని జిల్లా ముఖ్య నేత వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో… కాపు ఓట్లు ఆ పార్టీకి ఎక్కువ పడే అవకాశం ఉంది. అయితే మిగతా పార్టీ నేతలు ఆ సామాజికవర్గం చెందిన వారే కావడంతో…కాపు ఓట్లు మూడు పార్టీలకి సమానంగా పడనున్నాయి. ఇక బీసీలు తెదేపా, వైకాపా వైపు ఉండొచ్చు. కమ్మ ఓటర్లు ఎక్కువ తెదేపాకి మద్ధతు ఇవ్వనున్నారు. మొత్తం మీద బందరులో ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పోరులో బందరుని ఎవరు కైవసం చేసుకుంటారో చూడాలి.

Related Posts