YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కార్డులెక్కడ..?

కార్డులెక్కడ..?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వివాహిత గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆమె ఆరోగ్య వివరాలను, ఆమెకు అందించే పౌష్టికాహార వివరాలను నమోదు చేసేందుకు వినియోగించే మాతా, శిశు సంరక్షణ(ఎంసీహెచ్‌) కార్డులు పీహెచ్‌సీల్లో నిండుకున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గర్భిణులకు వీటిని పంపిణీ చేస్తారు. ఏడాదిగా కార్డుల కొరతను ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు గర్భం దాల్చిన సమయంలో కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో నాలుగుసార్లు వైద్యసేవలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మహిళల వైద్య చరిత్ర, గర్భం దాల్చిన తేదీ, ప్రసవం తేదీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయడం, కాన్పు జరిగిన తర్వాత బిడ్డకు వేసే టీకాల వివరాలు, ప్రభుత్వం అందించే జననీ సురక్షాయోజన పథకాల ఆర్థిక సాయం వివరాలను ఎంసీహెచ్‌ కార్డుల్లో తప్పని సరిగా నమోదు చేయాలి. మూడు నెలలుగా కార్డులు నిలిచి పోయినట్టు సమాచారం.
అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాలు, జిల్లా ఆస్పత్రులకు ఎంసీహెచ్‌ కార్డులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేస్తోంది. ఈ కార్డులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా అవసరాన్ని సరఫరా చేయాల్సి ఉండగా, కొంతకాలంగా వీటి సరఫరా నిలిచిపోయింది. కార్డుల కొరత  ఉండడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఫొటోస్టాట్‌ కాపీలను అందజేస్తున్నారు.  ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య పరీక్షలకు వెళ్లే గర్భిణులు, బాలింతలు వైద్యాధికారులకు ఎంసీహెచ్‌ కార్డులు చూపించాలి. గర్భిణుల్లో హెమోగ్లోబిన్‌ శాతం, అందుతున్న మందులు, బిడ్డ ఎదుగుదల చెప్పే స్కానింగ్‌ వివరాలన్నీ కార్డులో నమోదు చేయాల్సి ఉంది. కార్డులు కావాల్సినన్ని అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎంసీహెచ్‌ కార్డుల కొరతను పలువురు వైద్యాధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకు రావడంతో మూడు నెలల క్రితం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎంసీహెచ్‌ కార్డుల కొరతను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా నేటి వరకు ఎంసీహెచ్‌ కార్డులు రాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు 6–10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి గర్భిణికి ఈ కార్డులు ఇవ్వడం వల్ల వారి పూర్తి వివరాలు ఇందులో నమోదవుతాయి. ఎంసీహెచ్‌ కార్డులు జిల్లాకు రప్పించడంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Related Posts