యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గుంటూరు: పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది.
నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్‌షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.