యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనపై కుమార్తె సునీతారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు తమ కుటుంబాన్ని దోషిగా చూపుతున్నారని విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో నష్టం జరగడమే కాకుండా అందుకు సంబంధించిన నింద కూడా తమపైనే మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైద్య వృత్తిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తండ్రి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుండడం చూసి మాట్లాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి హత్య కేసులో ఆదినారాయణరెడ్డిని సిట్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. తమ కుటుంబానికి చెందిన అందర్నీ విచారణ జరుపుతున్నప్పుడు అనుమానాలున్న ఇతర వర్గాల వారిని ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు. పరమేశ్వర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య సంబంధాలపై ఎందుకు ఆరా తీయడం లేదని ప్రశ్నించారు.
హత్య నిజంగా మా ఇంటి వాళ్లే చేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే బహిర్గత పర్చి ఉండేదని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. నాన్చుతున్నారు కాబట్టి ఇది రాజకీయ వ్యూహంలా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి హత్యపై ఉన్న తన అనుమానాలను దృశ్య రూపక ప్రదర్శన ద్వారా విలేకరులకు వివరించారు. ‘‘నాన్న చనిపోయిన విషయం ఉదయం 6.40కి తెలిపారు. మాకు పరమేశ్వర్ రెడ్డిపై అనుమానాలున్నాయి. స్థానిక సీఐకి అక్కడ ఏం జరిగిందో అంతా తెలుసు. పరమేశ్వర్ రెడ్డి 14వ తేదీ పొద్దున నాలుగున్నరకు ఆస్పత్రిలో చేరారు. అడ్మిట్ అయ్యేటప్పుడు వివేకానందరెడ్డి తనకు దగ్గరి బంధువు అని డ్యూటీలో ఉన్న డాక్టర్ కి చెప్పాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఫోన్ వాడుతూనే ఉన్నారు. సాయంత్రానికి వైద్యుల ప్రమేయం లేకుండా తనంతట తానే ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి దగ్గర్లోని హరిత హోటల్ లో తెదేపాకు సంబంధించిన వారిని కలిశారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. రాత్రి 8 గంటలకు మళ్లీ అదే హాస్పిటల్ కు వచ్చారు. మళ్లీ ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి నిజంగా అనారోగ్య సమస్యలుంటే ఎవరైనా బయటకు వెళ్తారా? వివేకా చనిపోయాక మళ్లీ డిశ్చార్జ్ అయి వేరే ఆస్పత్రిలో చేరారు. అసలు హరిత హోటల్ లో ఏం జరిగింది. రాత్రి వచ్చిన వ్యక్తి ఎవరు? వంటి అనుమానాలు మాకు ఉన్నాయి. వివేకా హత్యలో పరమేశ్వర్ రెడ్డి పాత్ర ఉందని ఆమె అన్నారు. నా తండ్రి గుండెపోటుతో మృతి చెందారని బయటికు ఎవరు ప్రచారం చేశారో తెలియదు. ఈ విషయాన్ని సిట్ తేల్చాలి. దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలు చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి’’ అని సునీతారెడ్డి ప్రశ్నించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నేతలందరితో నాన్నకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం ఆదినారాయణరెడ్డి వర్గానికి తెలుసు. రాజకీయంగా అడ్డుతొలగించుకునేందుకే వివేకాను హత్య చేయించారని సునీతారెడ్డి అన్నారు.వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీగా గెలవడం కోసం తన తండ్రి పనిచేశారని, జగన్ ను సీఎం చేయడం కూడా ఆయన లక్ష్యమని సునీత వివరించారు. 15న తెల్లవారుజామున తండ్రి చనిపోతే 14న రాత్రి 10 గంటల వరకూ జమ్మలమడుగులోని ఓ సమావేశంలోనే పాల్గొన్నారని గుర్తుచేశారు.