యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రముఖ సినీనటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఓ పుష్పగుచ్ఛాన్ని అందించి ఊర్మిళను పార్టీలోకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. 45 ఏళ్ల ఊర్మిళను ముంబై నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ, ప్రత్యక్ష రాజకీయాల దిశగా ఇది తన తొలి అడుగని చెప్పారు. ఎంతో సామాజిక చైతన్యం, బలమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. గాంధీ, నెహ్రూ, పటేల్ ల సిద్ధాంతాలను తమ కుటుంబం ఆచరిస్తుందని చెప్పారు. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినా... తాను సినీ రంగంవైపు మొగ్గు చూపానని అన్నారు. అయినా, చిన్నతనం నుంచి తనకు సామాజిక అంశాల పట్ల ఎంతో అవగాహన ఉందని చెప్పారు.1993లో బాల నటిగా ఊర్మిళ సినీ రంగ ప్రవేశం చేశారు. 1995లో రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రంగీలా'తో ఆమె బాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. తెలుగులో కూడా పలు చిత్రాలలో ఆమె నటించారు.