యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి ఏడు పేజీల లేఖ రాశారు. ఈసీ ఆదేశాలతో తాను షాక్కు గురయ్యానని లేఖలో ఆయన పేర్కొన్నారు. సహజ న్యాయానికి విరుద్దంగా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బదిలీలకు కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని సీఎం ఆరోపించారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని.. అలాంటప్పుడు ఆ పోస్టులో ఉన్న వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. తొలి దశలో ఏపీ ఎన్నికలు రావడం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో తెదేపా ప్రచారం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. మోదీ-జగన్-కేసీఆర్ ఈ కుట్రలకు కారణమని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై ఈడీ కేసులు, వైకాపా అధినేత జగన్పై 31 కేసులున్నాయన్నారు. అలాంటి వ్యక్తులిచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ లేకుండా చర్యలెలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం విషయంలో వైకాపాపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈసీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి బదిలీలను వెనక్కు తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీల్లో భాగంగానే ఎస్పీ వెంకటరత్నం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారన్నారు. వివేకా హత్య కేసులో కడప ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో కడప ఎస్పీ బదిలీ వెనుక కారణాలేంటని ఈసీకి రాసిన లేఖలో ఆయన ప్రశ్నించారు.