యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన 68 పెయింటింగ్స్‌ను అదాయపు పన్ను శాఖ మంగళవారం వేలం వేసింది. వీటి ద్వారా ఐటీ శాఖకు నికరంగా రూ.55 కోట్లు సమకూరాయి. ఆదాయపు పన్ను శాఖ తరుపున సఫ్రోనార్ట్ ఈ వేలం నిర్వహించింది.
రూ.13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో భాగంగా అధికారులు సీజ్ చేసిన నీరవ్ మోదీ కలెక్షన్లలో ఇవి ఒక భాగం మాత్రమే. మోదీ షెల్ కంపెనీల్లో ఒకటైన కేమ్‌లట్ ఎంటర్‌ప్రైజెస్ ఈ వేలం నిలిపివేయాలని ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కేమ్‌లట్ నుంచి దాదాపు రూ.96 కోట్ల రికవరీ లక్ష్యంగా ఈ వేలం జరిగింది. వేలంలో దాదాపు 100 మంది పాల్గొన్నారు. వేలంలో జొగెన్ చౌదురీ పెయింటింగ్ రూ.46 లక్షల ధర పలికింది. దీనికి రూ.18 లక్షలు విలువ అంచనా వేశారు. ఎఫ్.ఎన్ సౌజా 1955 ఇంక్ ఆన్ పేపర్‌కు రూ.32 లక్షలు వచ్చింది. అంచనా విలువ రూ.12 లక్షలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. అలాగే కొన్ని పెయింటింగ్స్ ఏకంగా రూ.కోటికిపైగా ధర పలికింది. ఇందులో వి.ఎస్. గైటోండె వేసిన 1973 ఆయిల్ ఆన్ క్యాన్వాస్ ధర ఏకంగా రూ.25.24 కోట్లు. రాజా రవి వర్మ పెయింటింగ్ రూ.16.10 కోట్ల ధర పలికింది. అలాగే వేలంలో విక్రయమైన పెయింటింగ్స్‌లో కే లక్ష్మాగౌడ్, అక్బర్ పదంసే, రీనా కల్లత్, అతుల్ డోదియా, గుర్‌చరణ్ సింగ్, హెచ్ఏ గాదే వంటి కళాఖండాలు ఉన్నాయి.