యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారతదేశపు మొట్టమొదటి లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల 23న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ లోక్‌పాల్ సభ్యులైన 8 మందితో పినాకి చంద్రఘోష్ ప్రమాణస్వీకారం చేయించారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం-2013ను అనుసరించి మరో ఎనిమిది మందిని లోక్‌పాల్ కమిటీ సభ్యులుగా ఎంపికచేశారు. వివిధ హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బీ భోస్లే, జస్టిస్ ప్రదీప్‌కుమార్ మహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్‌కుమార్ త్రిపాఠిని జ్యుడీషియల్ మెంబర్స్‌గా, సశస్త్ర సీమాబల్ మాజీ చీఫ్ అర్చన రామసుందరం, మహారాష్ట్ర మాజీ సీఎస్ దినేశ్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి మహేందర్‌సింగ్, మాజీ ఐఏస్ ఇంద్రజీత్ ప్రసాద్ గౌతమ్‌ను నాన్ జ్యుడీషియల్ మెంబర్స్‌గా ఎంపికచేశారు. లోక్‌పాల్ ప్రమాణ స్వీకారంతో 2013లో పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత అంటే అరేళ్ళకు లోక్ పాల్ చట్టం అమలులోకి వచ్చింది. చట్టం, ప్రజా సేవకులతో పాటు కొన్ని వర్గాల వ్యతిరేకంగా అవినీతి కేసులను విచారించే అధికారం కేంద్రంలో లోకాయుక్తకు, రాష్ట్రాలలో లోక్ పాల్ కు వుంటుంది.నిబంధనల ప్రకారం లోక్‌పాల్ చైర్మన్, సభ్యులు ఐదేండ్ల పాటు లేదా 70 ఏండ్ల వయసు వచ్చేవరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం జస్టిస్ ఘోష్ వయసు 66 సంవత్సరాలు. ఆయన మరో నాలుగేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు లభిస్తాయి.