యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం సృష్టించిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సహా ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ల పరిధి కానప్పటికీ తెలంగాణ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి మాత్రం.. ఇదేమీ రాజకీయంగా జరిగింది కాదని, కీలకమైన ఎన్నికల డేటా, ఆధార్ డేటా చోరీకి గురైంది గనక సంబంధిత కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై మరోసారి హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా అశోక్ తరఫున వాదనలు విన్పించారు. అసలు ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన డేటా పోయిందా.. లేదా? ఆధార్‌కు సంబంధించిన డేటా దుర్వినియోగం అయిందా.. లేదా? అనేది ఆ సంస్థలు చెబితేనే తెలుస్తుంది తప్ప వేరే వారు ఎలా చెబుతారని ఆయన ప్రధానంగా వాదనలు విన్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల ప్రధాన అధికారి, ఆధార్ సంస్థ సీఈవో, ఆధార్ నమోదు సంబంధించి ఏపీ వ్యవహారాలు చూసే రిజిస్ట్రార్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.