YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధం: రఘురామ్‌ రాజన్‌

తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధం: రఘురామ్‌ రాజన్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని తన మనసులోని మాటను వెల్లడించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్న నేపద్యం లోరాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలనే పుస్తకంలో పొందుపరిచామన్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తాన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు.ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్‌ విధులు నిర్వహించిన  విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రాజన్‌ వ్యవహరించారు. 

Related Posts