YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని, ఒక పథకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారని, రైతులు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయని చంద్రబాబు, వారిని మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.  2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో డ్రామాలు, మోసాలు చేశారని, మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన చర్యలున్నాయని జననేత గుర్తు చేశారు.  విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఉదయం  జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పట్టణం జనసంద్రంగా మారింది.  అయిదేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలన చూశామని, ఆయన హయాంలో విజయనగరం జిల్లాకు ఏం చేశారని చూస్తే పెద్ద సున్నా కనిపిస్తుందని, 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడో మనందరికీ తెలుసని, ఇప్పుడు మళ్లీ అలాంటి డ్రామాలు, మోసాలే కనిపిస్తున్నాయని జగన్ గుర్తు చేశారు.  విజయనగరం జిల్లాకు నాడు వైయస్సార్ హయాంలోనే న్యాయం జరిగిందని, తోటపల్లి ప్రాజెక్టు అందుకు ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. రూ.450 కోట్ల ఆ ప్రాజెక్టులో రూ.400 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90 శాతం పనులు ఆయన పూర్తి చేయగా, మిగిలిన 10 శాతం పనులు చంద్రబాబు పూర్తి చేయలేదని తెలిపారు. అందుకే 1.25 లక్షల ఎకరాలకు గానూ ఇప్పుడు 80 వేల ఎకరాలకు మించి నీరందడం లేదని చెప్పారు. ఒడిసాతో వివాదం ఉండడంతో ఎవరూ జంఝావతి ప్రాజెక్టు చేపట్టలేదని, కానీ వైయస్సార్  దాన్ని చేపట్టి రబ్బర్ డ్యామ్ కట్టారని వెల్లడించారు.  చంద్రబాబునాయుడు మాటిమాటికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని చెన్నై, బెంగళూరు వెళ్తారని, ఇంకా సరిపోదు అనుకుంటే కాఫీ తాగడానికి సాయంత్రం రాహుల్గాంధీ దగ్గరకు కూడా పోతాడని, కానీ అదే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పక్కనే ఉన్న ఒడిసా చీఫ్ మినిస్టర్ దగ్గరకు మాత్రం పోనే పోడని  ఆక్షేపించారు.  ఆ దిశలో చంద్రబాబు చొరవ చూపించి ఉంటే, జంఝావతి, వంశధార ప్రాజెక్టులు పూర్తయ్యేవని, ఈ ప్రాంత రైతుల భూములు సశ్యశ్యామలం అయ్యేవని స్పష్టం చేశారు.  ఇదే పార్వతీపురం పురపాలక సంఘంలో తాగనీటి సమస్య తీవ్రంగా ఉందని, నాగావళి నదిలో నేలబావులు పాడై పోతే ఈ నాలుగున్నర ఏళ్లలో పట్టించుకున్న వారే లేరని గుర్తు చేశారు. పట్టణంలోని 100 పడకల ఏరియా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని చెప్పారు.  పార్వతీపురం ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువని, దారి పొడవునా పాదయాత్రలో వారిని చూశానని, వారంతా తన దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారని, సమస్యలు ప్రస్తావించారని  జగన్ వెల్లడించారు. కాగా, ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ వారి సమస్యను పట్టించుకోలేదని, పైగా ఆ సంస్థ ఆస్తులను చంద్రబాబుతో పాటు, ఆయన బినామీలు కాజేశారని ఆరోపించారు.   3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి కుటంబం పడుతున్న ఆవేదన విన్నానని, ప్రతి కుటుంబం పడుతున్న కష్టాన్ని కళ్లతో చూశానని చెప్పారు.

Related Posts