Highlights
- ప్రజా చైతన్య యాత్రకు ఉరలేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు..
- యాత్రకు బస్సు సిద్దం..
- బస్సు వెంట రెండు ప్రత్యేక ప్రచార రథాలు
- సర్వ మత పూజలు, చేవేళ్ళలో భారీ సభ
- విజయవంతం చేయాలని క్యాడర్ ఉత్తమ్ పిలుపు
- వివిధ రకాల కమిటీల ఏర్పాట్లు ..
- రాత్రి బసలు, క్యాడర్‌తో ముచ్చట్లు..
- విజయవంతం చేయాలని క్యాడర్ ఉత్తమ్ పిలుపు
ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రకు అన్ని సిద్దమయ్యాయి. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులంతా కలిసి కాంగ్రెస్ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడంతోపాటు, టిఆర్ ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేసి, రాబోయే ఎన్నికలలో ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రకు సర్వం సిద్దమయింది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై పనిచేయడానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందరితో సంప్రదింపులు జరిపి నాలుగు రకాల కమిటీలను నిర్మాణం చేశారు.
కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క నేతృత్వంలో సలహా కమిటీ, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆర్గనైజింగ్ కమిటీని, కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి ఆర్థిక కమిటీ, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి నేతృత్వంలో మీడియా కమిటీలను నియమించారు. వీరంతా యాత్రను విజయవంతం చేసేందుకు ఎవరి స్థాయిలలో వారు శ్రమిస్తున్నారు. సోమవారం నుంచి బస్సు బయలు దేరడానికి సిద్దమయింది. వోల్వో కంపెనీకి చెందిన 40 సీట్ల బస్సు సిద్దమయింది. నాలుగు వైపులా ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు ఎఐసిసి నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎఐసిసి కార్యదర్శులు, ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి కుంటియాల బొమ్మలను అతికించారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఉత్తమ్, రాహుల్‌ల భారీ పోస్టర్లను అతికించారు. ఈ బస్సుతోపాటు రెండు ప్రచార రథాలను సిద్దం చేశారు. ఎక్కడైనా నియోజకవర్గంలో స్టేజీలు లేని ప్రాంతంలో రథం నుంచి మాట్లడానికి, మధ్యలో ఎక్కడైనా అత్యవసరంగా ప్రసంగాలు చేయడానికి ఇబ్బంది కాకుండా రెండు ప్రత్యేక రథాలు కూడా సిద్దం చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ మంత్రి దానం నాగేందర్, ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, నాయకులు కౌశిక్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు.
కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ముందుగా నాంపల్లి దర్గా వద్ద పూజలు చేసి అక్కడి నుంచి రథయాత్ర బయలు దేరుతుంది. నేరుగా వెల్లి 11 గంటలకు ఆరే మైసమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు, 12 గంటలకు మొయినాబాద్ వద్ద చార్జీలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన తరువాత 1 గంటకు చేవేళ్ళకు చేరుకొని అక్కడ చేవేళ్ళ బహిరంగ సభలో చైతన్యయాత్ర తొలి ప్రసంగాన్ని చేస్తారు. అక్కడి నుంచి 4 గంటల వరకు వికారాబాద్‌కు చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా వికారాబాద్ రాత్రి బస చేసి అక్కడే నాయకులతో, కార్యకర్తలతో నియోజకవర్గ అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు వికారాబాద్‌లో అల్పాహారం ముగించి మధ్యాహ్నం 1 గంట వరకు తాండూరుకు చేరుకుంటారు, అక్కడ బహిరంగ సభ అయ్యాక, 4 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. సంగారెడ్డిలో రాత్రి బస చేసి 28వ తేదీన ముందుగా మధ్యాహ్నం 1 గంటకు జహీరాబాద్‌లో 4 గంటలకు నారాయణ ఖేడ్‌లో సభలలో ప్రసంగిస్తారు, రాత్రి నారాయణ ఖేడ్‌లో బస చేస్తారు. కాగా మూడు రోజులలో పూర్వ రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఆరు నియోజక వర్గాలలో సభలలో మాట్లాడుతారు.
ప్రధానంగా నాలుగేళ్ళలో తెలంగాణ ప్రబుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, నిరంకుశత్వం, కుటుంబ పాలన, అప్పులు, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన, దళిత, గిరిజన, బి.సి మైనారిటీ ప్రజలపైన దాడులు, విద్యార్థి, యువజన వర్గాలపై నిర్లక్ష్యం, మహిళలను అవమానపర్చడం లాంటి అనేక అంశాలపై ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తెస్తారు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉద్యమించిన నేతలపై ప్రస్తుత పాలకులు చేస్తున్న దౌర్జన్యం, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత, భయంకరమైన అవినీతి, రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలు, మద్దతు ధరలు లేకపోవడం, రైతుల ఆత్మహత్యలు, వీటికితోపాటు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మినీ మ్యానిఫెస్టో తదితర అనేక అంశాలపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించనున్నారు. దీంతో ప్రజలలో చైతన్యం రావడంతోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం వచ్చే అవకాశాలున్నాయి. నియోజకవర్గాలలో నేతల మద్య సమన్వయం ఏర్పడడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీకి మంచి అవకాశాలుంటాయనే భావన సర్వత్రా నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్‌గా భావిస్తున్న చేవేళ్ల నుంచి ఈ సారి కూడా యాత్రలు ప్రారంభించడం శుభ పరిణామంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.