యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ఎక్కడికక్కడ గెలుపు గుర్రాలకే పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ముఖ్యంగా కులాల ప్రాతిపదికన ఇచ్చిన టికెట్లు.. ఆయా నియోజకవర్గాల్లో పోరును మరింత పెంచాయి. ముఖ్యంగా కొన్నికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులతోపాటు సామాజిక వర్గాలను కూడా ప్రభావితం చేయగలిగే రేంజ్‌లో అదేసమయంలో సింపతీ వర్సెస్ స్థానికత కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కీలకమైన నియోజక వర్గం కృష్ణాజిల్లాలోని గుడివాడ. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వంటి నేతలు గెలుపు గుర్రం ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. 1983, 1985లో జరిగిన వరుస ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ విజయం సాధించారు.ఇక, ప్రస్తుతానికి వద్దాం.. కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం అన్ని కులాలు, మతాలకు కూడా సమాహారంగా నిలిచింది. అయినప్పటికీ.. ఇక్కడ ఆధిపత్యం మొత్తం కూడా కమ్మ సామాజిక వర్గం చేతిలోనే ఉందనేది వాస్తవం. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఉరఫ్ నాని విజయం సాధిస్తూ వచ్చారు. ఇక్కడ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని కూడా ఆయన తయారు చేసుకున్నారు. వ్యక్తిగత ఇమేజ్‌ను భారీ ఎత్తున పెంచుకున్నారు. దీంతో నే ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఏ టికెట్‌పై పోటీ చేసినా విజయం తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పరాజయం నేపథ్యంలో వ్యూహాన్ని మార్చుకున్నారు.ఇక్కడే ఉండి పార్టీ తరఫున పోరు చేస్తున్నా.. గెలుపు గుర్రాలు ఎక్కని వారిని పక్కన పెట్టి వ్యూహాత్మకంగా విజయవాడకు చెందిన దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపారు. ఆర్థికంగా బలంగా ఉండడం, కమ్మ వర్గానికి చెందిన నాయకుడే కాకుండా నెహ్రూ అనుచర గణం బలంగా ఉన్న నియోజకవర్గం. పైగా టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న యువనాయకుడు, విద్యావంతుడనే సింపతీ కూడా ఉండడం వంటివి ఇక్కడ అవినాష్‌కు కలిసి వస్తున్నాయి. కానీ, కొడాలి నాని కూడా ఇదే రేంజ్‌లో దూసుకుపోతున్నారు. వైసీపీ తరఫున రంగంలోకి దిగిన ఆయన ఇక్కడ బలమైన తన వర్గాన్ని చేరదీయడంతోపాటు.. కాపు వర్గాన్ని కూడా తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఇక్కడ పోరు హోరా హోరీగా సాగుతుందని అంటున్నారు.ఇక్కడ నుంచి జనసేన తరఫున రఘునందనరావు, కాంగ్రెస్ తరఫున దత్తాత్రేయులు, బీజేపీ తరఫున గుత్తికొండ రాజాబాబులు తలపడుతున్నారు. వీరిలో కొంత మేరకు ఓట్లు చీల్చే అవకాశం కొట్టిపారేయలేని పరిస్థితి. అయినప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం కొడాలి వర్సెస్ దేవినేని అంటున్నారు. స్థానికుడు కావడం కొడాలికి కలిసి వస్తున్న పరిణామం. అదేసమయంలో బలమైన వర్గం. జగన్ ప్రకటించిన నవరత్నాలు వంటివి ప్లస్‌గా మారాయి. ఇక, దేవినేని విషయానికి వస్తే.. చంద్రబాబు పథకాలు, యువ నాయకుడినిప్రోత్సహించాలని చూడడం, స్థానిక టీడీపీ నేతల సహకారం. వినూత్న ప్రచారం. వంటివి ఆయనకు ప్లస్‌గా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.