YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్నదాతలకు మంచి రోజులు

అన్నదాతలకు మంచి రోజులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అన్నదాతకు మంచిరోజులు వస్తున్నాయి.రానున్న రోజుల్లో రైతులకు ప్రయోజనం కలిగే పలు రకాలైన పథకాలు ఆచరణలోకి రానున్నాయి. అనుకున్నట్టుగా అన్నీ అమల్లోకి వస్తే ఆర్థికంగా మరింత బలపడనున్నారు. రుణాల కోసం, బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా, కాలాన్ని వృధా కాకుండా సకాలంలో చేతికి డబ్బు అందే విధంగా రైతులకు రూపే కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇప్పటికే దీనిపై ఆదేశాలు జారీ చేయగా తొలిదశలో కొంతమందికి వీటిని అందివ్వగా పూర్తిస్థాయిలో రూపే కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు డిసిసి బ్యాంకుల యాజమాన్యాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.  రైతుల కోసం నడుస్తున్న సొసైటీలను ఆర్ధిక పరిపుష్టి సాధించే దిశగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులోభాగంగా రైతులకు ప్రయోజనం కలిగి ఉండే రూపే కార్డులను జారీ చేస్తుంది. గత ఆరు మాసాలుగా ఈ కార్డుల ప్రక్రియ చేపట్టగా, బెంగుళూరులో ఉన్న ఓ కార్పొరేట్ సంస్థకు టెండర్‌ను పిలిచి మరీ తయారీ బాధ్యతను అప్పగించడంతో వీటి జారీలో కాస్తంత జాప్యం జరుగుతోంది. రూపే కార్డులు జారీ అయితే వీటితో సంబంధిత సొసైటీల ద్వారానే ఆర్ధిక సహాయాన్ని పొందవచ్చు. అలాగే వరి విత్తనాల అమ్మకాల ద్వారా రైతులు మరింతగా ప్రయోజనం పొందే విధానం అమల్లోకి వచ్చింది. అంత లాభసాటిగా లేకపోయినా ఆర్ధికంగా కాస్తంత నిలదొక్కుకునేందుకు ఇది సహకరిస్తుంది. ప్రధానంగా జిల్లాలో పలు మండల కేంద్రాల పరిధిల్లోకి వచ్చే 22 సహకార సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరాల విభాగానికి అందజేస్తున్నారు. వంద కిలోల ధాన్యం బస్తాను రూ.1460లు, రూ.1520లుగా విక్రయిస్తుండగా, ప్రతి క్వింటాల్‌కు రూ.32ల వరకు రైతులకు కమిషన్ పద్ధతిలో అందుతుంది. రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు పంపించేందుకుగాను ఈ కమిషన్ అందజేస్తారు. దీంతోపాటు ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్కో బస్తాకు ఐదు రూపాయల వంతున రైతులకు అందిస్తుంది. ఈ విధంగా ఎరువులు, వరి విత్తనాలు, ధాన్యం వంటివి సొసైటీల ద్వారానే అమ్మకాలు సాగిస్తున్న పరిస్థితులు రైతులు ఆర్థికంగా బలపడేందుకు సహకరిస్తున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు దళారులను నియంత్రించినట్టు అవుతుంది. సకాలంలో బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే ఈ విధానాన్ని మరింతగా పటిష్టపర్చనున్నారు.

Related Posts