యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నవ్యాంధ్రలోని మూడు ప్రాంతాల్లో వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను ఇకపై సులభంగా తెలుసుకోవచ్చు. ఇస్రో సహకారంతో ప్రభుత్వం రూపొందించిన ఈ మొబైల్ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు! క్షణాల్లో ఉష్ణోగ్రత నుంచి గాలిలో తేమశాతం వరకు అంతా ఈ యాప్ చెప్పేస్తుంది. అంతేనా? మనం ఉన్న ప్రాంతంలో ఆ సమయంలో భూగర్భ జలాల నీటిమట్టం ఎంత లోతులో ఉందో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 24 గంటల నుంచి 8 రోజుల వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను మన కళ్లముందు ఉంచేదే ఈ వరుణ యాప్. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో నవ్యాంధ్రలో తొలిసారి ఆవిష్కృతమైన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన ‘యాప్’ రైతులతో పాటు అన్ని వర్గాలకూ ఉపయోగపడనుంది. వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే ‘వరుణ’ మొబైల్ యాప్‌ను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్‌ఛార్జ్ బి.రాజశేఖర్ సోమవారం ఆవిష్కరించారు. ఇస్రో, వాసర్ ల్యాబ్ సంయుక్తంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి. వరుణ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా వాతావరణంలో జరిగే నిరంతర మార్పులైన ఉష్ణోగ్రత, గాలివేగం, వర్షపాతం, గాలిలో తేమశాతం, భూగర్భ జలాల నీటిమట్టం వంటి వివరాలను రియల్ టైంలో తెలుసుకునే వీలుంటుందన్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండవచ్చని ఇస్రో ఇప్పటికే అంచనా వేసిందని, దానికనుగుణంగా ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకునే వీలు కలుగుతుందని రాజశేఖర్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి 14 కి.మీ పరిధిలోని వాతావరణాన్ని ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1800 వాతావరణ కేంద్రాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.
‘వరుణ’ యాప్ ఉపయోగాలివీ!
* తదుపరి 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే వాతావరణ మార్పులను 6 గంటల విరామంతో గుర్తించవచ్చు.
* ఇస్రో తదుపరి 7 రోజులకు వాతావరణ సూచనలు అందిస్తుంది.
* ఇస్రో - షార్‌తో ప్రభుత్వం కలిసి పని చేయడం ద్వారా సైక్లోన్ ఏర్పడే తీరును గుర్తించడం వీలవుతుంది. బంగాళాఖాతంలో వచ్చే సైక్లోన్‌ల సామర్ధ్యం, వాటి మార్గాం, తీరం, తీవ్రతలను సరైన సమయంలో గుర్తించవచ్చు.
* సైక్లోన్ వచ్చే సమయం, ప్రాంతం మరియు తీవ్రతలను గుర్తించడం
* భారీ వర్షపాతం కురిసే ప్రాంతాలు, గాలి వేగం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్న మండలాలను ముందుగానే గుర్తించవచ్చు.
* నిర్ధేశిత ప్రాంతంలో ప్రమాద తీవ్రతను తగ్గించడం, నివారణ చర్యలను ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టవచ్చు.
* ప్రజా సేవలను సాధ్యమైనంత మేర అంతరాయం కలగకుండా చూడటమే వరుణ యాప్ లక్ష్యం.