యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సంచలనం రేపిన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచేస్తోంది. వివేకా హత్యకేసుపై పవన్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. తమకు జరిగిన అన్యాయమే.. పవన్ కుటుంబానికి జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రచార సభల్లో పాల్గొన్న జగన్.. చంద్రబాబు, పవన్‌లపై మండిపడ్డారు. పాలకొల్లులో జరిగిన ప్రచార సభలో మాట్లాడిన పవన్ ‘అయ్యా యాక్టర్ గారూ... పార్టనర్ గారూ.. మా చిన్నాన్నకు జరిగినట్లే మీ ఇంట్లో ఘటన జరిగి.. తర్వాత ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి.. మీ బంధువులే ఆ పని చేశారు.. మీరే ఆ పని చేశారని ఆరోపిస్తే మీకు నచ్చుతుందా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనూ ఆయన ఇలానే మాట్లాడతారా’అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఐదేళ్లుగా ఏపీలో జరుగుతున్న అవినీతిపై నోరు మెదపకుండా.. తనను విమర్శించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయమని చెప్పి ఓటేయించారని.. ఈ టీడీపీ పాలనలో జరిగిన ప్రతి అన్యాయంలో.. ప్రతి మోసంలో ఈ పార్టనర్ అక్కడే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కు వాటా లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు పడవని విడి, విడిగా పోటీ చేస్తున్నట్లు బాగా నటిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ఏడాది ముందే పవన్, చంద్రబాబులు విడిపోయినట్లు బాగానే నటిస్తున్నారని జగన్ ఆరోపించారు. పవన్ నామినేషన్‌లో టీడీపీ జెండాలు కనిపిస్తాయని విమర్శించారు. ఒకవేళ పవన్ చంద్రబాబుతో కలిసుండకపోతే.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఈ ఇద్దరి డ్రామాలు నమ్మి మోసపోవద్దని సూచించారు జగన్