యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు పులివెందుల పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివేకా హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 15న ఉదయం బాత్రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని బెడ్‌రూమ్‌కు తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. బెడ్‌రూంలో ఉన్న రక్తపు ఆనవాళ్లు చెరిపేసి సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేయకముందే మృతదేహాన్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 15న ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను బయటపెట్టలేదు. లేఖ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.