YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మహిళకేదీ పట్టం..?

మహిళకేదీ పట్టం..?

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజకీయంగా జిల్లాలో మహిళల పరిస్థితి తీసికట్టుగా  ఉంది. రాష్ట్రంలోనే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో కలిగిన జిల్లాల్లో నెల్లూరు ఒకటి. మహిళా ఓటర్లు 11,23,624 , పురుష ఓటర్లు 10,82,690 ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు 40,934 మంది అధికంగా ఉన్నారు.జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా నమోదయ్యారు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రమే పురుషులు అధికంగా ఉన్నారు.
రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పది నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు గణనీయంగా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో జిల్లాలోని కోవూరు నియోజకవర్గం అయిదో స్థానంలో ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లు 1,29,854 మంది ఉన్నారు. జిల్లాలో చూస్తే కోవూరులోనే అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్నారు.పురుషుల కన్నా మహిళలు 8,868 మంది ఎక్కువ.
మహిళలకు తగినట్లుగా .. ఈ విధ]ంగా జిల్లాలో మహిళా ఓటర్లకు సరిపడా రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో పలువురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నా, వీరిలో చట్ట సభలకు ఎంపికైంది మాత్రం కొందరే. 1952 నుంచి ఎన్నికలు జరుగుతున్నా ఇప్పటి వరకు చట్టసభలకు పోటీ చేసిన మహిళలను వేళ్లమీద లెక్కిస్తే సరిపోతుంది. జిల్లాలో మహిళా చైతన్యానికి తగినట్లుగా మహిళల ప్రాతినిధ్యం మాత్రం లేదు. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మహిళా చైతన్యం వెల్లివిరిసింది. పొణకా కనకమ్మ వంటి స్వాతంత్య్ర సమరయోధురాలు, పాటూరు బాలసరస్వతమ్మ వంటి విప్లవ నారీమణులు నడయాడిన నేల నెల్లూరు సీమ. అందుకు తగినట్లుగా మహిళల ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరం.
జిల్లాలో శాసనసభ ఎన్నికల్లో మహిళలు పోటీ చేయడం 1955 నుంచి ప్రారంభమైంది. 1955లో బుచ్చిరెడ్డిపాళెం నియోజకవర్గం ద్విస్వభ్య నియోజకవర్గంగా ఉండేది.అప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పి.శ్రీదేవమ్మ పోటీ చేసి 36,657 ఓట్లు సాధించి పరాజయం చెందారు. 1967 ఎన్నికల్లో అల్లూరు నియోజకవర్గం నుంచి వి.విమలమ్మ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.13,389 ఓట్లు సాధించి గెలుపునకు దూరమయ్యారు. అప్పుడు ఇక్కడ బెజవాడ పాపిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.1972 ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి టి.కె.శారదాంబ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం సాధించలేదు. ఇక్కడి నుంచి 11 ఏళ్ల పాటు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున మహిళలు పోటీ చేయలేదు.
1983 ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎం.ఎల్‌.కాంతమ్మ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా అపజయం చెందారు. ఇక్కడ నుంచి తిరిగి 16 ఏళ్లపాటు మహిళలు పోటీ చేయలేదు. 1999 వరకు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులుగా మహిళలు పోటీ చేయలేదు.1999లో జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి ముగ్గురు మహిళలు పోటీ చేయడం విశేషం.కాంగ్రెస్‌ పార్టీ తరఫున గూడూరు నుంచి కె.రామమ్మ, వెంకటగిరి నుంచి ఎన్‌.రాజ్యలక్ష్మి, తెదేపా తరఫున టి.శారద పోటీ చేశారు. వీరిలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. జిల్లాలో తొలి మహిళా శాసనసభ్యురాలిగా ఎంపికైన నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ముగ్గురు మహిళలు పోటీ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు శాసనసభకు ఒకే సారి ఎంపికయ్యారు. కొత్త చరిత్ర సృష్టించారు. 2004లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుంచి వరుసగా రెండో సారి గెలవగా, మాగుంట పార్వతమ్మ కావలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
2009 ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీల తరఫున ఇద్దరు మహిళలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినా వీరిద్దరు ఓటమి చెందారు. వెంకటగిరి నుంచి నేదురుమల్లి రాజ్యలక్ష్మి,కోవూరు ప్రజారాజ్యం పార్టీ తరపున పి.మునెమ్మ పోటీ చేయగా పరాజయం చెందారు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని గూడూరు శాసనసభ నియోజకవర్గం నుంచి బి.జ్యోత్స్నలత తెదేపా నుంచి పోటీచేసి ఓటమి చెందారు.వైకాపా తరఫున పది శాసనసభ నియోజకవర్గాల నుంచి మహిళలు ఎవరూ పోటీ చేయలేదు.
జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు పోటీ చేయడం 1989 సంవత్సరం నుంచి ప్రారంభమైంది.తెలుగుదేశం పార్టీ ఇందుకు శ్రీకారం చుట్టింది. 1989లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎం.నాగభూషణమ్మ తొలిసారిగా పోటీ చేసినా గెలుపు సాధించలేకపోయారు. 1991 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.పద్మశ్రీ విజయం సాధించారు. అప్పుడు ఈమెకు ప్రత్యర్థిగా నిలిచిన ఎం.నాగభూషణమ్మ(టీడీపీ) పరాజయం చెందారు. 1996లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ఈ ఎన్నికతో పాటు, 1998, 2004ఎన్నికల్లో విజయం సాధించారు. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పనబాక లక్ష్మిని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో నిలిపింది. తెదేపాలో చేరిన అతి తక్కువ వ్యవధిలోనే ఈమెకు లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారు చేయడం విశేషం.

Related Posts