YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గరీబీ హఠావో 2.0 పై మాయా విసుర్లు

గరీబీ హఠావో 2.0 పై మాయా విసుర్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తాము అధికారంలోకి వస్తే నిరుపేదలకు కనీస ఆదాయ పథకం కింద ఏడాదికి రూ.72 వేలు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోసారి గరీబ్ హఠావో నినాదాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకురావడం, దీనిని ఓ పెద్ద అబద్దంగా బీజేపీ అభివర్ణించింది. తాజాగా దీనిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కనీసం ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున్న విమర్శలను సమర్థిస్తూనే ట్విటర్‌ వేదికగా ఆమె మండిపడ్డారు ‘కాంగ్రెస్‌ గరీబీ హఠావో 2.0 నినాదం ఒక పెద్ద అబద్ధమని అధికార బీజేపీ చేస్తున్న ఆరోపణలో నిజం ఉంది. అయితే అసత్యపు హామీలు ఇవ్వడంలో బీజేపీ కూడా తక్కువేం కాదు. నిజానికి ఆ రెండు పార్టీలూ ఒకే తాను ముక్కలు. పేద, బలహీన, రైతు, కార్మిక వర్గాల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడంలో దెందూ దెందే.. రెండు పార్టీలు ఒకే విధానాలను అవలంబిస్తాయి’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీపై తొలిసారిగా మాయావతి స్పందించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. అయితే, యూపీలోని కొన్ని సీట్లలో కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ పరస్పరం సహకరించుకుని పోటీ నుంచి తప్పుకోవడంతో వీటి మధ్య అంతర్గత ఒప్పందం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ఎన్నికల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన మాయావతి కాంగ్రెస్‌పై విమర్శల్లో పదును పెంచారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కనీస ఆదాయ పథకం అమలు సాధ్యంకాదని కమలనాథులు వాదిస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన గరీబీ హఠావో పథకం లాంటిదేనని ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని, దీని వల్ల దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు లబ్ది కలుగుతుందని రాహుల్ వెల్లడించిన విషయం తెలిసిందే. నెలకు రూ.6,000 చొప్పున అందజేస్తామని, దీని వల్ల 25 కోట్ల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. త్వరలోనే వీటి అమలు విధివిధానాలు ప్రకటిస్తామని, దీనిపై విదేశీ ఆర్థిక నిపుణులతోనూ చర్చించామని వెల్లడించారు

Related Posts