యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల కుటుంబాలకు మధ్య దశాబ్ధాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. రెండు కుటుంబాలకు చెందిన మూడోతరం ఆళ్లగడ్డలో ప్రత్యర్థులుగా మారారు. వైసీపీ నుంచి గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేస్తుండగా.. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అఖిలప్రియ రంగంలోకి దూకుతున్నారు. ఇక్కడ మరోమారు విజయం సాధించి తమకు తిరగులేదని నిరూపించుకోవాలని అఖిలప్రియ యోచిస్తుండగా, అఖిలప్రియ రాజకీయంగా వేసిన పలు తప్పులను అవకాశాలుగా మార్చుకుంటూనే తమ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని, ఓటు బ్యాంకుతో గెలవాలని బిజేంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఇక బలబలాల విషయానికి వస్తే ఇద్దరి అభ్యర్థులు కూడా సమానంగానే ఉన్నారని చెప్పాలి. అటు వాళ్లు ఇటు..ఇటు వాళ్లు అటు మద్దతు పలుకుతుండటంతో పోరు ఆసక్తదాయకంగా మారింది.1985 తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈ రెండు కుటుంబాలకు చెందిన నేతలే ప్రత్యర్థులుగా నిలవడం గమనార్హం. పార్టీలకు అతీతంగా రెండు కుటుంబాలు ఓటు బ్యాంకును కలిగి ఉండటం చెప్పుకోదగిన అంశం.1967 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలతో కలుపుకుని మొత్తం 17సార్లు ఎన్నికలు జరగగా ఇందులో గంగుల ఫ్యామిలీ ఐదు దఫాలుగా..భూమా ఫ్యామిలీ అత్యధికంగా తొమ్మిదిసార్లు..రెండుసార్లు మాజీమంత్రి ఎస్‌వీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. భూమా కుటుంబం నుంచి వీర శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి, అఖిలప్రియలు ఇక్కడి నుంచి విజయం సాధించారు. దివంగత నాగిరెడ్డికి అత్యంత దగ్గరి మిత్రుడు ఎస్‌వీ సుబ్బారెడ్డి అఖిల ప్రియకు సహాయ నిరాకరణ చేస్తుండటం, రాంపుల్లారెడ్డి వర్గం వైసీపీలో చేరడం ఆమెకు ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. అదే సమయంలో ఈ రెండు అంశాలు బిజేంద్రనాధ్ రెడ్డికి అనుకూలంగా మారాయి. అయితే పెద్దనాన్న గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో కొనసాగుతుండటం ఆయన్ను వెనక్కులాగే అంశంగా చెప్పాలి. భూమా నాగిరెడ్డి మరణానంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి అఖిలప్రియను కేబినేట్‌లోకి తీసుకోవడంతో సహజంగానే ఆమె నియోజకవర్గానికి ఎక్కువ నిధులు దక్కాయని చెప్పాలి. పలు ప్రభుత్వ పథకాల ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. గతంలో ఎవరి హయాంలో జరగనంత అభివృద్ధి జరిగిందనే చెప్పాలి. అయితే అదే స్థాయిలో ఆమె వివాదాస్పద నిర్ణయాలతో రాజకీయంగా సహకరించే వారిని దూరం చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో గతంలో సాధించినంత ఈజీగా విజయం దక్కకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట.