యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అంటేనే మెగాభిమానుల పార్టీగా చెప్పుకుంటారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఏర్పాటు చేసినా, ఇపుడు పవన్ రాజకీయం చేసినా కూడా పెట్టుబడి అభిమానులే. వారి మద్దతు చూసుకునే మెగా హీరోలు దూకుడు చేస్తూంటారు. అటువంటి మెగాభిమానులకు మూలపురుషుడు అనదగ్గ ఎం రాఘవరావు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని జనసేనకు గట్టి షాక్ ఇచ్చారు. విశాఖకు చెందిన రాఘవరావు ఇవాళా నిన్నా కాదు గత ముప్పయ్యేళ్ళుగా మెగా హీరోల అభిమానంతో తరిస్తున్నారు.ప్రజారాజ్యం పార్టీ స్థాపనలోనూ రాఘవరావు ముఖ్య భూమిక పోషించారు. అంతే కాదు, విశాఖలో ఏ కార్యక్రమం జరగాలన్నా మెగాభిమానులకు అతనే పెద్ద దిక్కు. ఇటు మెగా కుటుంబంలోని వ్యక్తిగా మెలిగే రాఘవరావు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను విశాఖలో ఏర్పాటు చేసి చిరంజీవి సేవలను జనంలోకి విస్తరించారు. ఆయన 2009 ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తే మొత్తం బాధ్యతలు చూశారు. ఇక మెగా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో కూడా తన వంతుగా కీలక భూమిక పోషించి అటు అభిమానులకు వారధిగా మెలగిన రాఘవరావు ఇపుడు తీవ్ర ఆవేదనతో జనసేనను విడిచి బయటకు వచ్చారు.జనసేన పార్టీ పోకడలు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తీరు పట్ల ఆయన మనస్తాపం చెంది ఆ పార్టీకి గుడ్ బై కొట్టారని టాక్. విశాఖ తూర్పు నుంచి పోటీ చేయాలనుకున్న రాఘవరావుని కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడమే కాకుండా అక్కడ ఏ మాత్రం సంబంధం లేని కోన తాతారావుకు పవన్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి ఓట్లను చీల్చేందుకు పవన్ వేసిన ఈ ఎత్తుగడ మెగా ఫ్యాన్స్ మూల పురుషుడినే పార్టీకి దూరం చేసింది.దీంతో విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ ని కలసిన రాఘవ రావు ఆ పార్టీలో చేరిపోయారు. రాఘవరావు చేరారు అంటే ఓ విధంగా మెగాభిమానుల ఆత్మ బయటకు వచ్చినట్లేనని అంతా భావిస్తున్నారు. మరి జనసేన అడుగులు ఏ విధంగా తడబడ్డాయన్నది రాఘవరావు పార్టీని వీడడంతోనే తెలిసిపోయిందని అంతా అంటున్నారు.