యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజంపేట రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీలో ఇమడలేక తాను వైసీపీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బత్యాల చెంగల్రాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఏమాత్రం కాదనలేం. బత్యాల చెంగల్రాయుడు కూడా బలమున్న నేత కావడతో ఆయనకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది.ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి దాదాపు 11,617 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ( 2012) తిరిగి ఆయనే గెలిచారు. అయితే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రామిస్ చేశారంటున్నారు.తాజాగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి, మేడా మల్లికార్జున్ రెడ్డిలు కలసి ప్రచారం చేస్తుండటం వైసీపీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మేడా గత ఎన్నికలలో గెలుపొందినా వర్గ రాజకీయాలతో పెద్దగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు రాజంపేట టీడీపీ. దీంతో ఆయన బయటకు వచ్చేశారు. మేడా తన ప్రచారంలో టీడీపీ నేతలు తనను ఎలా వంచించిందీ చెప్పుకొస్తున్నారు. మేడా మల్లికార్జున్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతే.ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని 2014లో గెలుపొందారు. ఇప్పుడు ప్రత్యర్థులిద్దరూ ఒక్కటి కావడంతో గెలుపు సునాయాసమని భావిస్తున్నారు.కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజంపేట మాత్రమే. ఇప్పుడు అక్కడ బత్యాల చెంగల్రాయుడు పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ ఎమ్మెల్సీ. బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన వైపు అధిష్టానం మొగ్గు చూపింది. బత్యాల కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పనిచేసి టీడీపీలోకి వచ్చిన వారే కావడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడాన్ని టీడీపీనేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద మేడా మల్లికార్జున్ రెడ్డి ఈసారి పార్టీ బలమా? వ్యక్తిగతంగా సత్తా చూపుతారా? అన్నది రాజంపేట నియోజకవర్గంలో తేలనుంది.