యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎండా కాలం వచ్చిందంటే చాలు.. బెట్టింగ్ రాయుళ్లకు పండగే. ఐపీఎల్‌లో ఈ రోజు మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ బాల్‌కి బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడతాడు.. ఏ బంతికి వికెట్ పడుతుంది.. ఇలా క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లు కడుతుంటారు. 2019 ఎన్నికల ఏడాది కావడంతో.. బెట్టింగ్ రాయుళ్లు అటు ఐపీఎల్, ఇటు ఎన్నికలతో ఫుల్ బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఏపీలో బెట్టింగ్‌ల జోరు ఎక్కువగా ఉంది. టీడీపీ మళ్లీ గెలుస్తుందా? జగన్ పార్టీ గెలుస్తుందా? ఎవరు సీఎం అవుతారనే అంశంపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక నియోజక వర్గ స్థాయిలోనూ బెట్టింగులు జోరందుకున్నాయి. ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల గురించి బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. భీమవరంలో పవన్ ఓడిపోతాడని బెట్టింగ్ రాయుళ్లు ఛాలెంజ్ చేస్తున్నారు. పవన్ భీమవరంలో ఓడిపోతాడని కోట్లలో పందేలకు దిగుతున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువయినప్పటికీ.. జనసేనాని ఓడిపోతాడని బెట్టింగ్ రాయుళ్లు బలంగా నమ్ముతున్నారు. జనసేనాని గెలిస్తే.. మీకు లక్ష రూపాయలు ఇస్తాం. ఓడితే రూ.3 లక్షలు ఇవ్వండని బెట్టింగులకు దిగుతున్నారట. గాజువాకలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్కడ జనసేనకు లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయి. దీంతో గాజువాకలో పవన్‌కు అనుకూలంగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతే రూ.5 లక్షలు ఇస్తాం, గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తారా? అని బెట్టింగులు కడుతున్నారట. బెట్టింగ్ రాయుళ్లు అంచనా వేస్తున్నట్టు పవన్ ఒకచోటే గెలుస్తాడా? లేదంటే రెండు చోట్లా గెలిచి సత్తా చాటతాడా? అనేది మే 23న తేలనుంది. అప్పటి వరకు బెట్టింగుల జోరు ఇలాగే కొనసాగుతుందేమో.