యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల ఖరీదు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి హేతుబద్ధంగా, పారదర్శకతవిధానంతో తగ్గించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. గత నాలుగేళ్లుగా విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించడం వల్ల విద్యుత్ దుబారాగా కళ్లెం వేసింది. దీని వల్ల విద్యుత్ సద్వినియోగం పెరిగింది. 2018-19 సంవత్సరానికి రూ.31982.97 కోట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని డిస్కాంలు ప్రతిపాదించగా రూ.24,565.32 కోట్లకు తగ్గించారు. 2017-18లో రూ.27764.22 కోట్లకు ప్రతిపాదనలు రాగా, రూ.21,565.32 కోట్లకు తగ్గించారు. 2016-17లో రూ.26649.98 కోట్లకు, రూ.21150.77 కోట్లకు తగ్గించారు. 2015-16లో రూ.25515.31 కోట్లకు రూ. 20496 కోట్లకు తగ్గించారు. 2014-15లో రూ. 40639.5 కోట్లకు రూ. 33626.6 కోట్లకు తగ్గించారు. ఇక విద్యుత్ చార్జీల విషయంలో కూడా ఏపిఇఆర్‌సి ఆచితూచి వ్యవహరిస్తోంది. 2015-16లో 92 శాతం మంది వినియోగదారులపైన, 2016-17లో 96.6 శాతం మంది వినియోగదారులపైన, 2017-18లో 90.5 శాతం మంది వినియోగదారులపైన, 2018-19లో వంద శాతం మంది వినియోగదారుల పైన చార్జీల పెంపుదల లేదు. 2015-16 నుంచి 2017-18 మధ్య మూడు సంవత్సరాల్లో 1.38 కవోట్ల మంది గృహ విద్యుత్ వినియోగదారుల్లో ఆరు లక్షల మందికి మాత్రమే విద్యుత్ చార్జీల భారం పడింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఉజ్వల్ డిస్కాం యోజన స్కీం వల్ల డిస్కాంలకు రూ. 17,720.50 కోట్ల భారం తగ్గింది. విద్యుత్ ప్రమాదాల వల్ల మరణించిన వారికి రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్న నిబంధనను ఏపిఇఆర్‌సి కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన అబ్జల్యూట్ లయబిలిటీ సూత్రాన్ని అమలు చేస్తున్నట్లు ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు