యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికల ప్రచారంలో తన మాటల ధాటిని పెంచారు ప్రధాని మోదీ. తన ప్రభుత్వం అంతరిక్షంలోనూ ఓ కాపాలాదారును ఉంచిందని అన్నారు. దృఢమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వానికి ఓటు వేయండి తప్ప.. కేవలం నినాదాలకే పరిమితయ్యే వారికి కాదని ఓటర్లను కోరారు. మిషన్ శక్తి గురించి చెబుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంతరిక్ష ఘనతను తక్కువ చేసిన ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ యాంటీ శాటిలైట్ టెక్నాలజీని విమర్శిస్తున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జేపోర్‌లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు లేకుండా దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసేదే కాదని ఆయన అన్నారు. బాలాకోట్ దాడులపై మాట్లాడుతూ.. నెల రోజులైనా కూడా ఇప్పటికీ పాకిస్థాన్ ఉగ్రవాదుల శవాలను లెక్కబెడుతుంటే.. ఈ ప్రతిపక్షానికి మాత్రం ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు. శత్రువు ఇంటికెళ్లి అక్కడి ఉగ్రవాదులను ఏరేస్తే వీళ్లు మత్రం ఆధారాలు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన మిషన్ శక్తి ప్రకటనను తప్పుబట్టడంపై కూడా మోదీ మండిపడ్డారు. మన సైనికులు, సైంటిస్టులను అవమానిస్తున్న ఇలాంటి వాళ్లు మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు.