యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆంధ్రావాళ్లను దున్నపోతులు, కుక్కలు అని విమర్శించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తితో జగన్ కలిశారనీ, ఇది క్షమించారని నేరమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. అసలు ఏపీపై తెలంగాణ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రజలు రక్షణ కవచంలా ఉండాలన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు.ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలుచేయాలని కోరినందుకు ప్రధాన మోదీ ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ అధికారంలోకి వస్తే ఎవ్వరూ అమరావతిలో పెట్టుబడులు పెట్టరనీ, పారిశ్రామికవేత్తలు సైతం పారిపోతారని వ్యాఖ్యానించారు. కేసుల కోసం కేసీఆర్ తో రాజీపడిన జగన్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం తాను ఐదేళ్లు కష్టపడ్డానని చంద్రబాబు తెలిపారు.కాబట్టి రాష్ట్ర ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలవాలని చంద్రబాబు కోరారు. మరిన్ని సంక్షేమ పథకాలతో భవిష్యత్‌ను మార్చుకుందామని ప్రజలకు సూచించారు. ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పులతో ఏపీకి వచ్చామనీ, ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ కంటే అమరావతి మిన్నగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలనీ, ప్రజల సంక్షేమం తన బాధ్యతని సీఎం అన్నారు. గుడివాడలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామనీ, తన నియోజకవర్గమైన కుప్పంకు దీటుగా గుడివాడను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు
నాని ఒక్క పనైనా చేస్తారా
వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ వ్యక్తి ఏ పార్టీలో పుట్టారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. తనకంటే పెద్ద మాటలు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం ఉన్నవాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దుర్మార్గుడుని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మీకెవరికైనా ఈ వ్యక్తి ఒక్క పనైనా చేశారా? అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. మామూలు సమయంలో కనపడడని, ఎన్నికల సమయంలో మూటలతో వస్తాడని ఎద్దేవా చేశారు. ఓట్లు కొని, ఆ తర్వాత వ్యాపారాలు చూసుకుంటాడని అన్నారు. ఇలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదని చెప్పారు.టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ ఇక్కడే ఇల్లు కొనుక్కుని, ఇక్కడే స్థిరపడ్డాడని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కుల ప్రస్తావనలు తెస్తున్నారని... కేఈ, కోట్ల కుటుంబాలను తాను కలిపానని... ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను కలిపానని... పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను కలిపానని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది తాను కాదా? అని ప్రశ్నించారు. కాపులకు రూ. 5వేల కోట్లు ఇచ్చానని... వారిని ఓట్లు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని చెప్పారు. తనది ప్రజాకులమని అన్నారు.