YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజుల కోటలో కాపు కాసేది ఎవరు

రాజుల కోటలో కాపు కాసేది ఎవరు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఈసారి గెలుపు అవకాశాలను భీమవరం అసెంబ్లీ సీటు నిర్ణయించనుంది. భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. భీమవరం అసెంబ్లీ సీటు నుంచి పవన్, నరసాపురం పార్లమెంటు బరిలో ఆయన సోదరుడు నాగేంద్రబాబు రంగంలో ఉండటం ఇప్పుడు ఈ ప్రాంతంలో రాజకీయాలను హీటెక్కిస్తోంది. భీమవరంలో జనసేన తరఫున పవన్, వైసీపీ అభ్యర్ధిగా గ్రంథి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్ధిగా పులపర్తి రామాంజనేయులు బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం పవన్, గ్రంథి శ్రీనివాస్ మధ్యే నెలకొంది. ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గం ఓట్లే కీలకం, దాదాపు 25 నుంచి 30 శాతం ఉన్న క్షత్రియులు ఎవరివైపు మొగ్గితే వారే ఇక్కడ విజేతగా నిలుస్తారు. వాస్తవానికి నరసాపురం లోక్ సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో కాపులకూ, రాజులకూ మధ్య సఖ్యత లేదు. హీరో ప్రభాస్ సినిమాలు విడుదలైనప్పుడు ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంటుంది.కాపులు, రాజులకూ మధ్య వివాదాల నేపథ్యంలో భీమవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్, జనసేనాని పవన్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం కీలకంగా మారింది. వీరిద్దరిలో రాజుల మద్దతు ఎవరు పొందితే వారికే ఇక్కడ విజయావకాశాలు ఉంటాయి. గ్రంథి శ్రీనివాస్ తో పోలిస్తే పవన్ ను కాపు నేతగా ఇక్కడి రాజులు భావిస్తున్నారు. దీంతో క్షత్రియులు పవన్ కు బదులుగా గ్రంథి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే నరసాపురం లోక్ సభ పరిధిలో రాజులతో పోలిస్తే ఎక్కువ జనాభా కలిగిన కాపులు ఏకమయ్యే అవకాశముంది.నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ తరపున కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ తరఫున కలవపూడి శివరామరాజు, జనసేన తరఫున పవన్ సోదరుడు నాగబాబు బరిలో ఉన్నారు. వీరిలో వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరూ రాజులు కావడంతో ఇక్కడ కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. భీమవరంలో క్షత్రియులు పవన్ కు మద్దతునివ్వడం లేక తటస్ధంగా వ్యవహరిస్తే నరసాపురం లోక్ సభ పరిధిలో కాపులు కూడా తటస్ధంగా వ్యవహరించే అవకాశముంది. అప్పుడు వైసీపీ, టీడీపీ అభ్యర్ధులైన క్షత్రియులు ఇద్దరికీ కాపుల ఓట్లు దక్కే అవకాశముంది. అలా కాదని భీమవరంలో పవన్ కు వ్యతిరేకంగా క్షత్రియులు ఓటేయాలని నిర్ణయించుకుంటే మాత్రం నరసాపురం లోక్‌సభ పరిధిలో కాపు ఓట్లన్నీ ఏకమొత్తంగా జనసేన అభ్యర్ధి నాగేంద్రబాబుకు పడే అవకాశముంది. అప్పుడు నాగబాబు విజయం సునాయాసమవుతుంది.క్షేత్రస్థాయిలో, బూత్ లెవల్లో క్యాడర్ కానీ పట్టు కానీ, లేని జనసేన ఈ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకునే భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో బరిలోకి దిగినట్లు ప్రచారం సాగుతోంది. అదీ చిరంజీవి కుటుంబం నుంచి ఇద్దరు భీమవరం, నరసాపురం నియోజవర్గాల నుంచి బరిలో ఉండటంతో క్షత్రియులకూ గట్టి పరీక్ష ఎదురవుతోంది. ఇన్నాళ్లూ కాపులకు వ్యతిరేకంగా ఏకమైన క్షత్రియ సామాజికవర్గం...ఈసారి భీమవరంలో వ్యవహరించే తీరుపైనే నరసాపురం లోక్ సభ సీటు ఫలితం ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు

Related Posts