YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమిళనాడులో దినకరన్ భవిష్యత్తు ఏంటీ

 తమిళనాడులో దినకరన్ భవిష్యత్తు ఏంటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మన్నార్ గుడి మాఫియా భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల కూటమి బలంగా కన్పిస్తుండటంతో శశికళ కుటుంబ పార్టీ పరిస్థితి డోలయామానంలో పడింది. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలు నెగ్గితేనే దినకరన్, శశికళ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు. కనీస స్థానాలు కూడా రాకుంటే వీరిద్దరినీ తమిళ ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది స్పష్టం అవుతుంది.తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళ చేతుల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటుందనుకున్నా అది తారుమారయింది. తాను నమ్మిన పళనిస్వామి మోసం చేశారని శశికళ ఇప్పటికే రగిలి పోతున్నారు. తాను జైలులో ఉన్నా పళని, పన్నీర్ సెల్వంలపై పగ ఎలా తీర్చుకోవాలన్న దానిపైనే శశికళ ఆలోచనలు సాగుతున్నాయి. తమ కుటుంబాన్ని పార్టీ నుంచి బయటకు నెట్టడమే కాకుండా పార్టీ గుర్తును కూడా కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మేనల్లుడు దినకరన్ చేత కొత్త పార్టీ పెట్టించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో దినకరన్ తమిళనాడు అంతటా చుట్టి వచ్చారు. తాజాగా 40 లోక్ సభ స్థానాలు, 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దినకరన్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యలా తయారైంది. ఎప్పటికప్పుడు జైలులో ఉన్న మేనత్త శశికళ ఆలోచనలను తీసుకుని ఆచరణలో పెడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం కన్పించడం లేదు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వేరు. ఈ ఎన్నికల వేరు అన్నది దినకరన్ కు స్పష్టంగా అర్థమయిందంటున్నారు.బలమైన పార్టీలను ఢీకొనడం అంత తేలిక కాదన్నది ఆయనకు ఇప్పటికి తెలిసి వచ్చింది. తన పంచన చేరి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోలేకపోతే నాయకత్వంపైనే నమ్మకం పోతోంది. తాజాగా దినకరన్ ప్రచారంలో కూడా పెద్దగా జనం నుంచి స్పందన కన్పించడం లేదంటున్నారు. కామన్ సింబల్ ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు. ఇది కూడా దినకరన్ పార్టీకి దెబ్బే.  దీంతో దినకరన్ తమ పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా, అన్నాడీఎంకే అభ్యర్థులకు విజయం దక్కకుండా చూడటమే తన లక్ష్యంగా పనిచేసుకుపోతున్నారు. అధికార పార్టీ ఓట్లను ఎన్ని చీలిస్తే అంత డీఎంకే కు మంచిది కావడంతో కాడిని మధ్యలోనే వదిలేసి డీఎంకేకు పరోక్ష సహకారం అందించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాల తర్వాత శశికళ కుటుంబం రాజకీయంగా తెరమరుగు అవుతుందా? లేదా? చూడాల్సి ఉంది.

Related Posts