యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిన్నటి దాకా నీతులు వల్లించిన వాళ్లు..ఒకరిపై మరొకరు ఛాలెంజ్‌లు విసురుకున్న వాళ్లు.. అధికారం కోసం మాత్రం తమ కులం మాత్రం ఒక్కటేనని చాటుకున్నారు. తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఓ ప్రత్యేకత ఉన్నది. వలసలకు పెట్టింది పేరు. తర తరాలుగా తక్కువ జనాభా శాతం కలిగిన ఉన్నత వర్గాలకు చెందిన వారే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. దాదాపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కలిస్తే ఏకంగా 80% పైగా జనాభా ఉంటారు.అత్యధికులు బహుజనులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వీరంతా కేవలం ఓటు బ్యాంకుగానే చూడబడుతున్నారు తప్పా.. అధికారంలో ప్రాతినిథ్యం వహించడం లేదు. విలువలకు కట్టుబడి వున్నామని.. మాదంతా హిందూత్వ ఎజెండా అని ఢంకా భజాయించి ప్రకటిస్తున్న బీజేపీ అన్ని పార్టీలకంటే హీనంగా తయారైంది. ఇతర పార్టీల నుండి వచ్చే వారిని చేర్చుకోవడం. వారికి టికెట్లను కేటాయించడం జరుగుతోంది. సమాజ్‌వాది పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుండి బీజేపీలో చేరిన చరిత్ర డికె అరుణది. ఎమ్మెల్యేగా, మంత్రిగా జిల్లాను కొన్నేళ్ల పాటు శాసించారు. ఎస్పీ నుండి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాను ఒంటి చేత్తో శాసించారు.కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఎక్కడలేని ప్రయారిటీ ఇచ్చింది. ఉన్నతమైన మంత్రి పదవిని కట్టబెట్టింది. ఒకానొక సమయంలో సీఎం రేసులో కూడా ఆమె పేరును పరిశీలించారు. అన్ని పదవులు అనుభవించిన ఆమె ఉన్నట్టుండి ..రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించారు. ఢిల్లీలో అమిత్ షా , మురళీధర్ రావు సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. అధికార పార్టీపై కాస్తో కూస్తో విమర్శించే సత్తా కలిగిన అరుణమ్మ ఉన్నట్టుండి పార్టీ మారడంతో పార్టీ శ్రేణులు ఖంగుతున్నాయి.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే మోదీని గద్దె దించి..పవర్‌లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే..అటు ఏపీలో..ఇటు తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వంశీ చందర్ రెడ్డిని తీసుకువచ్చి మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన బీసీలు తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తున్నారు. లోలోపల రగిలి పోతున్నారు. ఆయనకు ఏ మేరకు ఈ నియోజకర్గంలో పార్టీ శ్రేణులు సహకరిస్తాయన్నది ప్రశ్నార్థకమే.నీతులు బోధించే బీజేపీ బీసీకి టికెట్ ఇస్తానని చెప్పి ..ఏకంగా ప్రచారం చేసుకోమని పర్మిషన్ ఇచ్చిన ఖిల్లాగణపురం మండలానికి చెందిన బీజేపీ సీనియర్ లీడర్ శాంతి కుమార్‌కు ఆఖరు నిమిషంలో కోలుకోలేని షాక్ ఇచ్చింది. అరుణ చేరడంతో శాంతిలో అశాంతి మొదలైంది. ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారో.. ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ నేత సంజీవ్ ముదిరాజ్ ఆఖరు వరకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. డీకే అరుణతో పాటు రేవంత్ రెడ్డి పేర్లను పరిశీలించారు. రేవంత్‌కు వేరే నియోజకవర్గం కేటాయించడంతో సీన్ మహబూబ్‌నగర్ వైపు మారింది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రెడ్డి వర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేస్తే.. తానేమీ తీసిపోనట్టు అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ..కొడుకు కేటీఆర్‌లు సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి షాక్ ఇచ్చారు.ఆయన ఆఖరు వరకు తనకు సీటు వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ పార్టీ అధినాయకత్వానికి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేక జితేందర్ రెడ్డిని పక్కన పెట్టారు. నవాబ్ పేట మండలానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి బి - ఫారం ఇచ్చి పంపించారు. దీంతో జితేందర్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు రెడ్లకు కట్టబెట్టి .. అత్యధిక జనాభా కలిగిన బహుజనుల ఆశలపై నీళ్లు చల్లారు.