యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రధాని మోదీ శుక్రవారం జరిగిన కర్నూలు సభలో ‘సన్ సెట్ ఆంధ్ర్రప్రదేశ్’ అని చెప్పడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంపై ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. కర్నూలు సభతో ఏపీపై మోదీకి ఉన్న అక్కసు మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు.శనివారం ఉదయం అయన టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి ఎలాంటి నిధులు, ప్రాజెక్టులు నిధులు ఇవ్వకుండా మళ్లీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా మనపై ఇంకా కక్ష సాధిస్తున్నారన్నారు. వాళ్లు చేయకుంటే మనమే శ్వేతపత్రం విడుదల చేద్దామన్నారు. వాళ్లు ఢీ అంటే మనమూ ఢీ అందామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయకపోగా నిందలు మనపై మోపుదామనుకుంటే సహించొద్దన్నారు.. మోదీ సభకు వైసీపీ కార్యకర్తలను తరలించారనీ, తద్వారా బీజేపీ, వైసీపీ బంధం మరోసారి బయటపడిందని దుయ్యబట్టారు. ప్రజల్లో ఇంత గొప్ప స్పందన జీవితంలో చూడలేదు. పాల్గొన్న ప్రతిచోటా జన సముద్రమే కనిపిస్తోంది. రాజమండ్రిలో మహిళలంతా ఏక పక్షం అయ్యారని అయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వెంటే మహిళలంతా ఉన్నారు. ఎక్కడ చూసినా పార్టీ ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రత్యర్ధుల ఆరోపణలను బలంగా తిప్పికొడుతున్నారు. ఇదే స్ఫూర్తి రాబోయే రెండువారాలు కొనసాగాంచాలి. నేనింత కష్టపడేది ప్రజల కోసం, పార్టీ కోసమేనని అయన అన్నారు. ఏమరపాటుగా ఉంటే రాజ్యం నేరగాళ్ల భోజ్యం అవుతుంది. ప్రజలతో సత్ సంబంధాలే పార్టీ గెలుపునకు పునాదులని అన్నారు. ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. ఈ ఎన్నికల బాధ్యత మాదికాదనే ధోరణి సరైంది కాదు. పొరబాటు చేస్తే మొత్తం రాష్ట్రం పెను ప్రమాదంలో పడుతుంది. అన్నివర్గాల భవిష్యత్తు,పేదల సంక్షేమం చిక్కుల్లో పడుతుంది. అటు కేంద్రం అడ్డంకులు,ఇటు ప్రతిపక్షం కుట్రలు పన్నుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించేందుకు ఎంతో కష్టపడ్డామని అన్నారు.ప్రజల్లో మనకు అనుకూలత ఉంది కదా అని అతివిశ్వాసానికి పోవద్దని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. చివరి వరకూ నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఇన్ చార్జీల వ్యవస్థ ఉండదనీ, టీడీపీని ఏకపక్షంగా గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.