యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం నోటీసులు జారీ చేసింది. రైలు టిక్కెట్లు ఎయిరిండియా బోర్డింగ్ పాస్‌లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ప్రచురించినందుకు ఈ చర్య తీసుకుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 10నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మోదీ బొమ్మలను ముద్రించిన రైలు టిక్కెట్లు, ఎయిరిండియా బోర్డింగ్ పాస్‌లను ఉపయోగించడంపై వివరణ ఇవ్వాలని కోరింది. శనివారమే ఈ నోటీసులపై సవివరంగా స్పందించాలని ఆదేశించింది.ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఫొటోలను ముద్రించిన బోర్డింగ్ పాస్‌లను ఎయిరిండియా ఉపసంహరించాలని నిర్ణయించింది.రైలు టిక్కెట్లపై ఓ వైపు ప్రధాని మోదీ ఫొటోతోపాటు ప్రభుత్వ ప్రకటనను ముద్రించడంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం రైల్వేలను ఈ నెల27న వివరణ కోరింది.
నేను కూడా కాపలాదారునే అని ముద్రించి ఉన్న టీ కప్పులతో రైలు ప్రయాణికులకు టీని ఇవ్వడంపై శుక్రవారం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించి ఆ టీ కప్పులను ఉపసంహరించడంతోపాటు కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.