యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతికి కూడా జగన్ మోకాలడ్డుతున్నారని మంత్రి యనమల విమర్శించారు. పెంచిన రూ.2 వేలు యువతకు అందకుండా వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. పాత స్కీముకు కూడా ప్రతిపక్షం అడ్డంకుల పెడుతోందని చెప్పారు. అలాంటి పార్టీకి యువతరం బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పసుపు-కుంకుమ చెల్లింపునకు కూడా జగన్ అడ్డంకులు గురిచేస్తు్న్నారని మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ ఈసీ బాధ్యత అని యనమల అన్నారు. అలాంటిది ఇటీవల 3 అంశాల్లో ఈసీ ఏకపక్ష ధోరణి బట్టబయలైందని, 22 పార్టీలిచ్చిన వినతులను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అందుకు భిన్నంగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. కౌంటింగ్‌కు 6 రోజులు ఆలస్యం అనేది ఈసీ కుంటిసాకులే నని అన్నారు. లక్షలాది ఓట్ల తొలగింపుపై ఈసీ తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో ఫారం- 7 దుర్వినియోగం చేస్తే ఈసీ ఏం చేసిందని ప్రశ్నించారు. దరఖాస్తుల్లో 85 శాతం అసత్యమని తెలిసీ వాళ్లపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు.రాష్ట్రాలకు ఇవ్వాల్సినవి ఏవీ గత 5ఏళ్లలో మోదీ ఇవ్వలేదని యనమల అన్నారు. రాష్ట్రాలపై ప్రధాని పెత్తనం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. కేంద్రం పెట్టే ప్రతి పథకంలో రాష్ట్రం వాటా ఉందన్నారు. రాష్ట్రాలపై పెనుభారాలకు మోదీయే బాధ్యత వహించాలన్నారు. ఫాసిస్ట్‌గా మోదీ వ్యవహరిస్తున్నారని, ఫెడరల్ వ్యవస్థకే ఆయన పెను ప్రమాదంగా మారరాని యనమల విమర్శించారు.