యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
టీ20 అంటే కేవలం బాదుడే కాదు అందం కూడా అన్నట్లు! ఏమిటా ఆట.. ఏమిటా షాట్లు.. కళ్లుచెదిరేలా ఫ్లిక్‌లు.. అద్భుతమైన కట్ షాట్లు.. మైమరిపించే డ్రైవ్‌లు ఒకటా రెండా అన్ని అస్త్రాలు బయటకు తీశాడు పృథ్వీషా(99; 55 బంతుల్లో 12×4, 3×6) ఈ టీనేజర్ ధాటికి భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. శ్రేయస్ అయ్యర్ (43; 32 బంతుల్లో 4×4, 2×6)తో కలిసి అతను విరుచుకుపడడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా దూసుకెళ్లింది. అయితే ఆఖర్లో కుల్‌దీప్ యాదవ్ (2/41) ధాటికి తడబడడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అలవోకగా విజయాన్ని అందుకోవాల్సిన దిల్లీనే ఆఖరికి గెలిచింది. సూపర్ ఓవర్లో కోల్‌కతాను ఓడించింది. నిజానికి సూపర్ ఓవర్లో దిల్లీ చేసింది స్వల్ప స్కోరే. మొదట బ్యాటింగ్ చేయగా.. శ్రేయస్, పంత్ బరిలో దిగారు. కానీ ఆ జట్టు 10 పరుగులే చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి పంత్ ఒక పరుగు చేయగా.. రెండో బంతికి శ్రేయస్ ఫోర్ సాధించి, వెంటనే ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతులకు రెండేసి పరుగులు చేసిన పంత్.. ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. 10 పరుగుల ఛేదనలో కోల్‌కతా తరఫున రసెల్, కార్తీక్ బరిలో దిగారు. దిల్లీ తరఫున రబాడ బంతి అందుకున్నాడు. తొలి బంతికి రసెల్ ఫోర్ కొట్టగా.. రెండో బంతికి పరుగు రాలేదు.. మూడో బంతికి రసెల్ క్లీన్ బౌల్డ్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఉతప్ప, కార్తీక్ మూడు సింగిల్స్ మాత్రమే తీయడంతో దిల్లీ విజయ సంబరాల్లో మునిగిపోయింది.