యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, రైతు రుణమాఫీ చెల్లింపులు, పసుపు-కుంకుమ చెక్కుల చెల్లింపులు.. ఏప్రిల్ మొదటివారంలో ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయా పద్దుల కింద చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా 20 వేల కోట్ల రూపాయలు. వారం రోజుల్లో ఈ మొత్తం లబ్దిదారులకు సక్రమంగా చెల్లిస్తే చాలు ఓటర్ల మొగ్గు తమవైపే ఉంటుందని టీడీపీ భారీ అంచనాలే పెట్టుకుంది. విభజన తర్వాత రెవెన్యూ లోటుతో సతమతమవుతూ అప్పుల్లో కూరుకుపోతున్న ఏపీకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గుదిబండగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తోడు తాజాగా ప్రకటించిన పథకాలు ప్రభుత్వ ఖజానాకు భారంగా మారాయి. దీంతో ఎన్నికల వేళ నానాటికీ అధికారులపై ఒత్తిడి పెరిగిపోతోంది.అసలే ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న వేళ... ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పింఛన్ల పెంపు, పసుపు-కుంకుమ చెక్కుల చెల్లింపులకు తోడు గత ఎన్నికల హామీ రైతు రుణమాఫీ చివరి విడత చెల్లింపులు టీడీపీ సర్కారుకు కీలకంగా మారాయి. వీటికి మార్చినెల ఉద్యోగుల జీతభత్యాలు అదనం. కేవలం జీత భత్యాల కింద 4 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుండగా. రుణమాఫీ చివరి విడత చెల్లింపుల కోసం మరో 8 వేల కోట్లు, పసుపు- కుంకుమ పథకం చివరి విడత చెక్కుల చెల్లింపు కోసం 3 వేల కోట్లు, పింఛన్ల కోసం మరో 5 వేల కోట్లు ఖర్చు కానున్నాయి.ఏప్రిల్ మొదటి వారంలో ఈ మొత్తం చెల్లింపుల కోసం 20 వేల కోట్ల రూపాయలు ఒకేసారి ఖర్చుపెట్టాల్సి రావడంతో ప్రభుత్వ ఖజానా అధికారులతో పాటు బ్యాంకులపైనా ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆ రోజు బ్యాంకుల్లో ఉద్యోగులు విధుల్లో ఉండరు. 20 వేల కోట్ల రూపాయల్లో ఆన్ లైన్ పేమెంట్లను ఎలాగోలా సర్దుబాటు చేయగలిగినా... నేరుగా బ్యాంకుల్లో చెల్లించే పేమెంట్ల విషయంలో ఇబ్బందులు తప్పేలా లేవు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెల్లించే మొత్తాలను ఖజానా ద్వారా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. దీంతో లబ్ది దారులు నేరుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు.ఈసారి ఎన్నికలకు తోడు ఒకేసారి భారీఎత్తున చెల్లింపులు చేయాల్సి రావడంతో అటు ఖజానా అధికారులతో పాటు ఇటు బ్యాంకులపైనా తీవ్ర ఒత్తిడి నెలకొంది. వీటి ప్రభావం లబ్దిదారులపై పడితే లిక్విడ్ క్యాష్ లభ్యత తగ్గిపోయి రుణమాఫీ మొత్తాలతో పాటు చెక్కుల చెల్లింపులపైనా ప్రభావం పడనుంది. అదే జరిగితే ఎన్నికల్లో కొంపమునగడం ఖాయమని టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఖజానాతో పాటు బ్యాంకులపైనా ఒత్తిడి పెరుగుతోంది. అయినా సిబ్బంది కొరత, సెలవు దినాలు, నగదు లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు పూర్తిచేస్తామని అధికారులు చెప్తున్నారు.ఈసారి ఎన్నికల్లో అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా పోటీపడి హామీలు గుప్పిస్తున్నాయి. ఇందులో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఏడాది క్రితం వెయ్యి రూపాయలుగా ఉన్న పింఛన్లను చంద్రబాబు సర్కారు ఈ మధ్యే రెండు వేలకు పెంచింది. అటు జగన్ తాము అధికారంలోకి వస్తే పింఛన్లను 2 వేలకు పెంచుతామని, ఆ లోగా చంద్రబాబు ప్రభుత్వం 2 వేలకు పెంచితే తాము దాన్ని 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే 3 వేల పెన్షన్ ఇస్తామని తాజాగా ప్రకటించారు. ఇప్పటికే 2 వేల పెన్షన్ ఇస్తున్న తమకు ఓటు వేస్తారా లేక అధికారంలోకి వస్తే పెంచుతామంటున్న జగన్ కు ఓటు వేస్తారా అంటూ టీడీపీ టీవీ ప్రకటనల్లో ప్రశ్నిస్తోంది. దీంతో తాము చెప్పిన విధంగా 2 వేల పెన్షన్ కచ్చితంగా అందేలా చూడాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఖజానా, బ్యాంకుల నుంచి లభించే మద్దతుపైనే ఈ నెల పింఛన్లు, పసుపు-కుంకుమ చెక్కుల చెల్లింపులు ఆధారపడి ఉండటంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈసారి సక్రమంగా చెల్లింపులు చేయగలిగితే మాత్రం తమకు ఢోకా ఉండబోదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి