యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసలే ఎన్నికల సమయం.. ఈ టైమ్‌లో ప్రజల దృష్టిని ఆకట్టుకోడానికి రాజకీయ నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. దేశంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ నేతలు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఫొటోతో విడుదలైన బొట్టు బిళ్లల ప్యాకెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేంటీ.. మోదీ ఇప్పుడు బొట్టు బిళ్లలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారా? అని ఆశ్చర్యపోవద్దు. పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే సంస్థ ఈ బొట్టు బిళ్లల ప్యాకెట్లను విడుదల చేసింది. మళ్లీ మోదీయే అధికారంలోకి రావాలనే నినాదంతో ఒక వైపు ప్రధాని మోదీ ఫొటోను, మరోవైపు బీజేపీ గుర్తును ముద్రించింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోను పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ నియోజకవర్గం ఎంపీ సలీం ట్విట్ చేశారు. నోట్ల రద్దు సమయంలో పేటీఎం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మోదీ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖ చిత్రంగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఇటీవల చాలా రకాల ప్రయత్నాలను చేస్తోంది. టీషర్టులు, మగ్గులపై మోదీ ఫొటోలను ముద్రించి మార్కెట్లోకి వదులుతోంది. ఇవి మాత్రమే కాదు.. ప్రభుత్వ సేవలను కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ ఫోటోలను ముద్రించిన రైల్వే టికెట్లపై దుమారం రేగింది. దీంతో రైల్వే వాటిని ఉపసంహరించుకుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ ఎన్నికల నినాదమైన ‘మై బీ చౌకీదార్’ కప్పుల్లో ప్రయాణికులకు చాయ్ ఇవ్వడం కూడా వివాదానికి కారణమైంది. ఓ ప్రయాణికుడు ఆ కప్పు ఫొటోను ట్వీట్ చేస్తూ.. ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేశాడు. ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘనలోకి రాదా? అని ప్రశ్నించాడు. దీంతో రైల్వే శాఖ చర్యలు తీసుకుంది