యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
విశాఖ జిల్లాలో ఈ ఎన్నికల్లో బాగా పుంజుకున్న వైసీపీకి అసమ్మతి మరో వైపు భయపెడుతోంది. మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో అరడజను కు పైగా అసమ్మతి నేతల సహాయ నిరాకరణ వైసీపీకి తలనొప్పిగా మారింది. ఒకటి రెండు చోట్ల హై కమాండ్ సర్దిచెప్పి దారికి తెచ్చినా మిగిలిన చోట్ల మాత్రం మాట వినడంలేదు. ఇక ఏజెన్సీలో ఐతే ఏకంగా నామినేషన్లు కూడా వేసి రెబెల్స్ గా పోటీలో ఉన్నారు. దీంతో గెలుపు అవకాశాలు ఉన్న చోట ఓటమి పాలు అవుతామేమోనని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు.విశాఖ అర్బన్ జిల్లాలో చూసుకుంటే విశాఖ సౌత్ లో రాత్రికి రాత్రి పార్టీ మారినీ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రేనివాస్ కి అసమ్మతి నేతల బెడద ఎక్కువగా ఉంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయిన కోలా గురువులు టికెట్ ఆశించి భంగ పడ్డారు. ఆయన ఇపుడు ద్రోణం రాజుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా కనిపించడంలేదు. మత్సకార వర్గానికి చెందిన గురువులు కనుక మౌనం దాలిస్తే ఆ వర్గం ఓట్లు పోతాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక నిన్నటి వరకూ అక్కడ ప్రచారం చేపట్టి తనకే టికెట్ అని భావించిన డాక్టర్ రమణమూర్తి కూడా ఇపుడు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.ఇక విశాఖ తూర్పు సీట్లో భీమిలీ నుంచి వచ్చిన అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇవ్వడంతో అక్కడ గతసారి పోటీ చేసి ఓడిపోయినా వంశీక్రిష్ణ ఇపుడు ఏ మాత్రం సహకరించడంలేదు. దాంతో ఆమెది ఒంటరిపోరాటం అవుతోంది. అసలే అక్కడ బలమైన నాయకునిగా టీడీపీ సిట్టింగ్ వెలగపూడి ఉన్నారు. ఇక ఎలమంచిలిలో చూసుకుంటే అక్కడ కన్నబాబురాజుకి టికెట్ ఇవ్వడం వల్ల మాజీ ఇంచార్జులు ఇద్దరు అలిగి అల్లరి చేసి చివరికి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. దాంతో కన్నబాబురాజు ఇరకాటంలో పడ్డారు. గతంలో ఆయన గెలుపు సులువు అనుకుంటే ఇపుడు ఇబ్బందిగా మారింది అంటున్నారు.నర్శీపట్నంలో కూడా పాదయాత్ర వేళ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కీలకనాయకుడు ఎర్రాపాత్రుడు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఏజెన్సీలో చూసుకుంటే అక్కడ అరకు, పాడేరులలో టికెట్లు ఆశించి భంగపడిన దొర, విశ్వేశ్వర రాజు రెబెల్స్ గా బరిలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీకి సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి.