యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీకి అందరి మద్దతు సాధించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. సోమవారం ఉదయం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అయన మాట్లాడారు. ఈ పది రోజులు అందరూ అవిశ్రాంతంగా పని చేయాలని, ఈ 8 రోజులు పార్టీ ప్రచారం ఉద్ధృతంగా చేయాలని పిలుపునిచ్చారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమన్నారు. రూ.10వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ రూ.5లక్షలు, చంద్రన్న బీమా రూ.10లక్షలని, గ్రామాలు, పట్టణాల్లో హౌసింగ్ రుణాలు రద్దు చేస్తామన్నారు. రైతు బిడ్డగా రైతుల రుణం తీర్చుకున్నానని, రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన చెప్పారు. అన్నదాత సుఖీభవతో సీజన్కు ముందే పెట్టుబడులు అందిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకే సాంకేతికత అదనపు బలమన్నారు. అప్పజెప్పిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. సేవామిత్రులు, బూత్ కన్వీనర్లు పట్టుదలతో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో బూత్ కన్వీనర్ అంతే ముఖ్యమన్నారు. ప్రజాప్రతినిధులు ఎంత ముఖ్యమో సేవామిత్ర అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలన్నారు.