యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలను కలియుగ వైకుంఠంగా భావిస్తుంటారు భక్తులు. ప్రపంచంలో మరే దేవుడికీ లేనంత మంది భక్తులు ఆయన సొంతం. ఆయనకు జరిగే కైంకర్యాలు, సేవలు చూసి భక్తులు తన్మయంతో పులకించిపోతుంటారు. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమలగిరులకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుమలేశుడిని దూరం నుంచి చూసే భక్తులే పరవశించిపోతే.. ఆయనకు స్వయంగా సేవ చేసుకునే అర్చకుల గురించి ఇంక చెప్పేదేముంది. శ్రీవారికి సేవ చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమని వారు గొప్పగా చెప్పుకుంటారు. అయితే శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు మాత్రం శ్రీవారి ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రమణ దీక్షితులు మాట్లాడుతూ.. హుండీలో స్వామికి ఒక్క రూపాయి కూడా వేయకండి. హుండీ ఆదాయం రోజుకు రూ.2-3 కోట్ల వరకూ వస్తోంది. స్వామివారి సేవకు అందులోంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదు. పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, ఉత్సవాలన్నింటినీ దాతల సహకారంతోనే చేస్తున్నారు. పచ్చకర్పూరం, కస్తూరి కూడా దాతలే ఇస్తారు. హుండీ ఆదాయాన్ని స్వామివారికి ఖర్చుచేసే అవసరం రాకపోవడంతో అది పాపకార్యాలకు వినియోగించే అవకాశం ఉంది. అందుకే భక్తులు కానుకలు హుండీలో వేయడం కంటే ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళాలు ఇవ్వండి. మీకు పుణ్యం వస్తుంది’ అంటూ ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రమణ దీక్షితుల వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించిన మీరు.. అర్చక పదవి పోగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ భక్తులు నిలదీస్తున్నారు. శ్రీవారి ఆలయంపై విషం చిమ్మితే స్వామివారు మిమ్మల్ని క్షమించరంటూ హెచ్చరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలోని అర్చకులకు టీటీడీ 65ఏళ్ల నిబంధన తేవడంతో రమణ దీక్షితులు గతేడాది పదవీ విరమణ పొందారు. అయితే తనను అన్యాయంగా తొలగించారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.