YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భిన్నమైన ప్రచారంతో దూసుకెళ్తున్న బాబు

భిన్నమైన ప్రచారంతో దూసుకెళ్తున్న బాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అధ్యక్షులు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. భారీ ఎత్తున ఉద‌యం ఏడు గంట‌ల నుంచే ప్రచారం ప్రారంబించి నాన్ స్టాప్‌గా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఇక‌, ఈ రెండు పార్టీల నేత‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు చూపిస్తున్న దూకుడు మ‌రింత‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. ఆయ‌న ప్రచారంలో భిన్నమైన శైలిని అవ‌లంబిస్తున్నారు. గ‌తానికి భిన్నంగా అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఎక్కడ ఏ స‌మ‌స్య ఉన్నా.. దానిని స్పృశిస్తున్నారు. ప‌రిష్కారానికి హామీ ఇస్తున్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో తాను ఇన్నేళ్లలో చేసిన అభివృద్ధిని వివ‌రిస్తున్నారు. రాబోయే రోజుల్లో తాను చేయ‌బోది కూడా చెబుతున్నారు. అదేస‌మ‌యంలో ఇప్పుడు చంద్రబాబు ఎన్నిక‌ల‌కు వారం ముందు ప్రచారాన్ని మ‌రింత‌గా దూసుకుపో యేలా చేయాల‌ని భావిస్తున్నారు మెరుపులు మెరిపించాల‌ని చూస్తున్నారు.జాతీయ పార్టీ నేత‌లుగా ఉన్న కీల‌క పార్టీల నేత‌ల‌ను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లాల‌ను రంగంలోకి దింపుతున్నారు. ఏప్రిల్ మూడో తేదీ నుంచి మ‌రింత‌గా ప్రచారాన్ని ఉధృతం చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, ఇలా జాతీయ నేత‌ల‌ను తీసుకురావ‌డం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి? అనేది ప్రధాన చ‌ర్చ. చంద్రబాబును వ్యతిరేకించే వ‌ర్గం మాత్రం బాబు హ‌వా త‌గ్గిపోయింద‌ని, ఏపీ ప్రజ‌లు ఆయ‌న‌ను న‌మ్మడం లేద‌ని, అందుకే జాతీయ స్థాయిలో నేత‌ల‌ను తీసుకువ‌స్తున్నార‌ని అంటున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయి నుంచి ఏపీకి వ‌చ్చి ప్రచారం చేసిన నేత ఫ‌రూక్ అబ్దుల్లా కానీ, కేజ్రీవాల్ కానీ.. ప్రధాన న‌రేంద్ర మోడీపై పోరాడి ఓడిపోయిన నేత‌లేన‌ని చెబుతున్నారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఇదే కోవ‌కు చెందిన నాయ‌కురాల‌ని అంటున్నారు. ఇక‌, రాబోయే రోజుల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ కూడా వ‌చ్చి మంగ‌ళ‌గిరిలో మంత్రినారా లోకేష్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తార‌ని అంటున్నారు. ఇక‌, మెజారిటీ ప్రజ‌లు స‌హా బాబు అనుకూలుర ప్రచారం మ‌రోలా ఉంది. రాబోయే ఐదేళ్లు కూడా ఏపీకి కేంద్రంతో ప‌ని ఉంది. ప్రత్యేక హోదాను సాధించుకోవ‌డంలో కానీ, విభ‌జ‌న హామీల‌ను సాధించుకోవ‌డం, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, అమ‌రావ‌తి నిర్మాణానికి నిధులు, వివిధ కేంద్ర సంస్థల రాక‌, ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల విభ‌జ‌న‌, ప‌దో షెడ్యూల్‌లోని ఆస్తుల పంప‌కాలు వంటివి కీల‌కంగా మారిన స‌మ‌యంలో కేంద్రంలో త‌న‌కు ఉన్న ప‌లుకుబ‌డి, త‌ద్వారా రాష్ట్రానికి మేలు జ‌రిగే సూచ‌న‌లు ఉన్నాయ‌నే విష‌యాన్ని సీఎం చంద్రబాబు చెప్పక‌నే చెప్పేందుకు ఇలా వారిని ఆహ్వానిస్తున్నార‌ని అంటున్నారు. అంతేకాదు, ఇది ఏపీకి శుభ సూచ‌క‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Related Posts