YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో నీటి కష్టాలు

అనంతలో నీటి కష్టాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇదేవిధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఒట్టిపోతున్నాయి. రైతన్నలు తమ పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. ధర్మవరం మండలం రైతులు బోరుమంటున్నారు.  పంట దిగుబడి బాగా ఉన్న సమయంలో ఉన్నట్లుండి బోరులో నీరు తగ్గిపోయింది. పంట ఎండుముఖం పట్టడంతో కాపాడుకోవడానికి  రైతు తన పొలంలోనే మరోచోట బోరు వేయించాడు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి..  వెయ్యి అడుగుల మేర తవ్వించాడు. అయినా చుక్కనీరు పడలేదు. అంతటితో ప్రయత్నం ఆపలేదు. మరో నాలుగు బోర్లు  వేయించి దాదాపు రూ.6లక్షలు ఖర్చు చేసి పంటను కాపాడుకున్నాడు. అయితే.. పంట దిగుబడి మొత్తం బోర్లకు పెట్టిన ఖర్చుకే సరిపోయింది.  రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా పాతాళగంగను పైకి తేలేకపోతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో సగటున వంద బోర్లు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధర్మవరం, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం, కదిరి, రాయదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో గత ఆరు నెలలుగా డీప్‌బోర్లు అధికంగా తవ్విస్తున్నారు. లోతులో నీరుపడితే చాలా రోజుల పాటు  ఎండిపోకుండా ఉంటాయని భావిస్తున్న రైతులు చాలా మంది వెయ్యి అడుగుల మేర తవ్విస్తున్నారు. ఒక్కో డీప్‌ బోరు తవ్వకానికి రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ లెక్కన రోజుకు వంద బోర్లు తవ్వించేందుకు రూ.1.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. జనవరి  నుంచి ఇప్పటి దాకా బోర్లు తవ్వించడానికి జిల్లా రైతులు దాదాపు రూ.135 కోట్లు ఖర్చు చేశారు. ఈ మూడు నెలల్లో రైతులు పెట్టిన ఖర్చుతో ఒక చిన్న ప్రాజెక్ట్‌ పూర్తి చేయొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.వెయ్యి అడుగుల బోరు తవ్వకానికి రూ.1,22,000తో పాటు కేసింగ్‌ ఖర్చు ప్రతి అడుగుకు రూ.350 చొప్పున  అవుతుంది. సాధారణ భూముల్లో అయితే 20 అడుగుల మేర కేసింగ్‌ వేస్తారు. ఇసుక నేలల్లో అయితే 50 నుంచి 100 మేర కేసింగ్‌ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్‌లారీ సిబ్బంది భోజనం, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు రూ.3 వేల వరకు వస్తాయి.వర్షాలు పడితే భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది. అయితే వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి.  

Related Posts