YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల వేళ వలసపక్షుల్లా రాష్ట్రంపై వాలిన సినీనటులు

ఎన్నికల వేళ వలసపక్షుల్లా రాష్ట్రంపై వాలిన సినీనటులు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైకాపా అధ్యక్షుడు జగన్‌..పేరులోనే ‘గన్‌’ ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయనకు ఎప్పుడూ నేరాలు, ఘోరాలేనని, ఎప్పుడేం కుట్రలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలే తనకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రజలే తనకు పోలీసు అధికారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. కులంపేరుతో విమర్శలు చేయడంపై నిప్పులు చెరిగారు.  ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అల్లాడినప్పుడు కనబడని మోహన్‌బాబు, జయసుధ, అలీ లాంటి నటులు ఎన్నికల వేళ వలసపక్షుల్లా రాష్ట్రంపై వాలారని మండిపడ్డారు. కేసీఆర్‌కి భయపడి హైదరాబాద్‌ నుంచి వచ్చి ఏపీలో పెత్తనం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించారు. గోద్రా అల్లర్లలో 2వేల మంది మృతికి మోదీనే కారకుడని ఆరోపించారు. పదవిలోకి రాగానే కొమ్ములు వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించేవరకు వదిలిపెట్టబోనన్నారు. రాష్ట్రంలో దుర్మార్గుల ఆటలు సాగనీయబోమని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్‌ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మోదీ, కేసీఆర్‌ నుంచి డబ్బులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే జైలుకు.. జనసేనకు ఓటేస్తే అత్తారింటికే పోతారని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకుంటే భవిష్యత్‌ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఒక్కసారి గెలిపించాలని జగన్‌ ప్రజలను కోరుతున్నారని.. ఒక్కసారి అని తినే తిండిలో విషం కలుపుకొంటామా?  ఒక్కసారి అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా? అని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.సామాజిక న్యాయమే తన ధ్యేయమని, నిత్యం  పేద ప్రజలతోనే ఉంటానని చంద్రబాబు  స్పష్టంచేశారు. ఏ ఒక్కరివాడిగా కాకుండా అందరివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు. 18 నుంచి 35ఏళ్ల లోపు యువత ఆలోచించి ఓటేయాలని సూచించారు.  కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్న తానేనన్నారు. పెన్షన్లు పదిరెట్లు పెంచి భరోసా కల్పించానని చెప్పారు. మోదీ మోసం చేసినా, కేసీఆర్‌  సహకరించకపోయినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలిపేందుకు కృషిచేసినట్టు చెప్పారు. రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సిగ్గులేకుండా పోలవరం తనకు ఏటీఎం అంటున్నారని, పోలవరానికి రూ.58వేల కోట్లు అవసరం కాగా.. అందులో కేంద్రం రూ.7వేల కోట్లే ఇచ్చిందన్నారు. ప్రధాని ఇచ్చేది సొంత సొమ్మా? అని ప్రశ్నించారు. పోలవరం పనులు ముందుకెళ్లకూడదనేదే మోదీ ఉద్దేశమని మండిపడ్డారు. జులైలో పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు అందించనున్నట్టు చంద్రబాబు స్పష్టంచేశారు.

Related Posts