యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఇటీవల తన ప్రసంగాల్లో వాడి పెంచారు. ఎక్కడికెళ్లినా అధికార, ప్రతిపక్ష పార్టీలను కడిగేస్తున్న పవన్.. ఆ రెండు పార్టీల వ్యతిరేక ఓటుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్‌పై పవన్ తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. తనను రెచ్చగొట్టొద్దని తనలోనూ రాయలసీమ పౌరుషం ఉందని పవన్ సవాల్ చేస్తున్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న పవన్ సీమ పరువు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాను సినిమాల్లో నటించాను కాబట్టి యాక్టర్‌నేనని, అయితే జైలుకెళ్లొచ్చిన జగన్‌ను ఏమని పిలవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాయలసీమను అవమానించేలా ఉన్నాయని కొందరంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నెల్లూరు లో ఒక జనసేన కార్యకర్త తనతో మాట్లాడుతూ ఫ్యాన్ రెక్కలు విరిచేయాలని అన్నాడని, అయితే తమది విరగదీసే సంస్కృతి కాదని, అది రాయలసీమకు చెందిన జగన్ లాంటి వారి అలవాటు’అని తాను చెప్పినట్లగా పవన్ వ్యాఖ్యానించారు. రాయలసీమ వాళ్లది హింసా ప్రవృత్తి అన్న కోణంలో పవన్ వ్యాఖ్యానించారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇది తమను అవమానించడమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ రాజకీయంగా జగన్‌ను విమర్శిస్తే ఫర్వాలేదని కానీ రాయలసీమను అందులో కలపొద్దని కోరుతున్నారు. నేతలు సీమ పౌరుషం గురించి మాట్లాడుకోవడం మాని ఆ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలో ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.