యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్లమెంట్‌కు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొనడం, ఈవీఎం, వివిప్యాట్ లపై సంపూర్ణ అవగాహన, ఎన్నికల్లో శాస్త్ర సాంకేతిక పద్దతులను ఉపయోగించుకోవడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడం, ఫ్రెండ్లీ ఓటింగ్ నిర్వహించడానికి పలు మొబైల్ యాప్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటిచేసే వారికి వివిధ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సులభంగా అనుమతులు పొందడం, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవడం, ఓటరు జాబితాలో తమ ఓటును పరిశీలించుకోవడం, దివ్యాంగ ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం తదితర అంశాలకు సంబంధించి విడివిడిగా ప్రత్యేక మొబైల్ యాప్‌ల సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ క్రింది యాప్‌లను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు.
*పోటీచేసే అభ్యర్థుల సౌకర్యార్థం ఇ-సువిధ యాప్*
ఎన్నికల ప్రచారం నిర్వహించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సౌకర్యార్థం ఇ-సువిధ యాప్‌ను భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా రాజకీయ పార్టీలు, లేదా అభ్యర్థులు ఎన్నికల ర్యాలీల నిర్వహణ, ప్రచార వాహనాల అనుమతి, ఎన్నికల కార్యాలయాలకు అనుమతి, లౌడ్ స్పీకర్లు, హెలిక్యాప్టర్లు, హెలిప్యాడ్‌ల అనుమతులను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఈ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, ఆయా రిటర్నింగ్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీచేస్తారని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ స్పష్టం చేశారు. అయితే ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించి సంబంధిత పోలీసు నోడల్ అధికారి నిరభ్యంతర పత్రం పొందిన అనంతరమే అనుమతులను సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీచేస్తారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 789 అనుమతులను జారీచేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు.
*ప్రవర్తన నియమావళి అమలుకు సి-విజిల్ యాప్*
ప్రస్తుత ఎన్నికలు మరింత పకడ్బందీగా నిర్వహించడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సి-విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుండి పనిచేస్తున్న ఈ సి-విజిల్ ద్వారా నగరంలో ఏ ప్రాంతంలోనైనా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే ఆయా సంఘటనలను పౌరులు తమ మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు కానీ, రెండు నిమిషాల స్వల్ప వీడియోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జి.ఐ.ఎస్ విధానం ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారి, డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారికి ఈ సమాచారం అందడంతో పాటు ఫిర్యాదు దారుడికి ఒక ప్రత్యేక నెంబర్‌ను కూడా ఆయన మొబైల్‌కు పంపడం జరుగుతుంది. ఈ ఫిర్యాదుదారు చేసే సమాచారాన్ని గోప్యంగా ఉంచడబడుతుంది. వీటిపై వెంటనే తగు విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల తేదీ ప్రకటన నుండి ఇప్‌ిటి వరకు సి-విజిల్ ద్వారా 51 ఫిర్యాదులు అందగా వాటి తగు చర్యలు చేపట్టినట్టు దానకిషోర్ తెలిపారు.
*దివ్యాంగుల సౌకర్యార్థం వాదా యాప్*
గత శాసన సభ ఎన్నికల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఓటరు ఆక్సెసబులిటి యాప్ ఫర్ ద డిఫరెట్లి ఏబుల్డ్ (వాదా) యాప్‌ను ప్రారంభించింది. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అంధులతో సహా దివ్యాంగులందరూ ఓటువేసేందుకుగాను తగు సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా వాదా యాప్‌ను ఉపయోగిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ వివరించారు. ఈ యాప్‌ను వినియోగించుకోవడం ద్వారా దివ్యాంగులు సులభంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి తిరిగి తమ ఇళ్ల వద్దకు చేరుకోవచ్చు, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారికి ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని, వాలెంటీర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్ట దానకిషోర్ తెలిపారు.
*మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోండి*
హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వీలుగా మైజీహెచ్ఎంసీ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మైజీహెచ్ఎంసీ యాప్‌కు వెళ్లి నో యువర్ పోలింగ్ బూత్ అనే అప్షన్‌కు వెళ్లి తమ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను ఎంటర్ చేసినట్టైతే సంబంధిత పోలింగ్ కేంద్రం సమాచారం తెలుసుకోవచ్చు.
*ఓటరు జాబితాలో తమ పేరును తెలుసుకోవడం*
హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు తమ పేరు ఉన్నది, లేనిది స్పష్టంగా తెలుసుకోవడానికి మైజీహెచ్ఎంసీ యాప్‌లో ప్రత్యేక ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మైజీహెచ్ఎంసీ యాప్‌కు వెళ్లి ఎలక్షన్ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి జాబితాలో తమ పేరు లేదా ఓటరు ఐడి నెంబర్‌ను ఎంటర్ చేసినట్టైతే సమాచారం స్పష్టంగా తెలుస్తుంది.