యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. గెలుపుగుర్రం రేసులో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు దూసుకుపో తున్నాయి. ఎన్నికలు కీలకం కావడంతో ఏ పార్టీకి ఆపార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తా యని భావిస్తున్న ప్రతి అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ విషయంలోఈ రెండు పార్టీల వ్యవహారానికి తోడు .. మరో పార్టీ జనసేన కూడా కలిసి వస్తోంది. ఈ పార్టీ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామనే చెబుతోంది. ఈ మూడు పార్టీలు రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని అంటున్నాయి. నిజానికి గత ఎన్నికల విషయానికి వస్తే.. వైసీపీ ఒక్కటే ఒంటరిగా పోటీ చేసింది.అదేసమయంలో టీడీపీ మాత్రం బీజేపీ, జనసేనలతో కలిసి ఎన్నికలకు వెళ్లింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీకి ఆ పార్టీ(ఒక్క కమ్యూనిస్టులు మినహా..) ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా కామెంట్లు కూడా కుమ్మరిస్తున్నాయి. ఇక, టీడీపీతో జనసేన లోపాయికారీ పొత్తు పెట్టుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో వైసీపీ బీజేపీ, కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నారని జనసేన సహా చంద్రబాబు వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు. ఇక, వీరి వ్యాఖ్యల ను ఎవరికి వారు ఖండిస్తున్నారు. జగన్‌తో పాటు నేను చంద్రబాబు ను కూడా దుమ్మెత్తి పోస్తున్నాను కదా? అంటున్నారు పవన్. ఇక, జగనేమో.. మీరు మీరు 2014లో పొత్తులు పెట్టుకుని, ఇప్పుడు నాపై రుద్దుతున్నారు ఎందుకు? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఈ రహస్య పొత్తుల విషయం రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళానికి గురి చేస్తున్న సమయంలోనే చిత్రమైన విషయాలు తెరమీదికి వచ్చాయి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు జనసేనాని పవన్ బయల్దేరి నప్పుడు.. ఆయనకు మద్దతుగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు కదలడం, భారీ సంఖ్యలో టీడీపీ జెండాలు ఎగరడం తెలిసిందే. ఈ పరిణామం.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును బహిర్గతం చేసిందనే వాదన వినిపిస్తోంది., ఇక, ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలూ వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పోలీసు సిబ్బంది సభలోకి అనుమతిచ్చారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు కనిపించాయి. వాటిని పక్కనపెట్టి లోపలికి అనుమతించారు. మరికొందరు ఏకంగా బ్యారికేడ్లకు వైసీపీ జెండాలు తగిలించడం కొసమెరుపు. మొత్తానికి ఈ తెరచాటు పొత్తులు, దోస్తులపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.