యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఒకసారి తప్పు చేస్తే.,. సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. నేతలు చేస్తున్న కామెంట్లు, సంఘటనలు పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఎన్నికల వేళ.. అందునా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వెయ్యి ఆశలతో అడుగులు వేస్తున్న ప్రధాన ప్రతిపక్షం.. ఆదిశగా అడుగులు వేయాల్సి ఉంది. అయితే గెలుస్తామన్న ధీమాతోనో… లేక ఏమైతే అవుతుందిలే అన్న అసహనంతోనో వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.పార్టీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో దాదాపు 3700 కిలో మీటర్ల దూరాన్ని వైసీపీ అధినేత జగన్ పాదయాత్రగా చుట్టొచ్చా రు. ఈ ప్రభావంతో ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని భావించారు. అయితే, ఈ వ్యూహాన్ని ఎవరూ కాదనలేరు. ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకుని ముందుకు కదులుతున్నారు. అయితే, ప్రచార పర్వం ఊపందుకున్న క్రమంలో ఇటు పార్టీ నాయకులు, అటు పార్టీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తిస్తున్న తీరు కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. గూడూరు వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వరప్రసాద్.. రెండు రోజుల కిందట నియోజకవర్గంలో చేసిన హడావుడి సోషల్ మీడియాలో హోరెత్తింది.ఇక, వైసీపీ ప్రచారానికి రానన్న గర్భిణిపై దాడి, వైసీపీకి ఓటేయనన్న వృద్ధులను ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి పరి ణామాలు సిల్లీవి కావు. సీరియస్‌గానే ఉన్నాయి. నిజానికి యెల్లో మీడియా వీటిని పెద్దవి చేసిందనే బదులు.. మనం జాగ్రత్తగా ఉన్నామా? లేదా? అనేది కూడా ముఖ్యమని అంటున్నారు వైసీపీ నాయకులు. ఇక, తాజాగా నరసాపురం ఎంపీ అభ్యర్థి.. కనుమూరి రఘురామకృష్ణరాజు ఓ సమావేశంలో ఊగిన సందర్భం మరింతగా పార్టీకి డ్యామేజీ చేసిందని అంటున్నారు. ఇవన్నీ పార్టీలోని నాయకులు, వీరాభిమానులు చేస్తున్న విషయాలుగానే ఉన్నా.. పార్టీ అధినేతే వరుసగా రెండు తప్పులు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.ఇక, ఏపీ వ్యతిరేకిగా.. ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉన్న కేసీఆర్‌తో తాను కలవడం ఏంటని ప్రశ్నించడం, ఇక, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని మోడీని తిప్పికొట్టాలని ఏపీ ప్రజలు నిర్ణయించుకున్న సయమంలో ఆయన పై మాట్లాడక పోవడం జగన్ పార్టీపై తీవ్రంగా ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. తన ప్రాధాన్యాలు వివరించాలి. బాబు లోపాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. బాబు వల్ల ఈ ఐదేళ్ల కాలంలో మారిన రాజకీయ పరిస్థితిని ఏకరువు పెట్టాలి. ఇలా ముందుకు వెళ్తేనే వైసీపీకి మేలు.. లేకుంటే మరోసారి అధికారానికి దూరం కాక తప్పదు.