యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జయభేరీ గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు .. ఈ వ్యవహారంలో టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌పై కేసు నమోదు చేశారు. నగదు తరలిస్తూ పట్టుబడిన నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరి సహా ఆరుగురిపై ఐపీసీ 171బీ, 171ఈ, 171సీ, 171 ఎఫ్ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ‘తనిఖీల నేపథ్యంలో హైటెక్ సీటీ రైల్వే స్టేషన్‌లో నిమ్మలూరి శ్రీహరి,అవూరి పాండరి అనుమానాస్పదంగా కనిపించారు. వారి దగ్గర ఉన్న బ్యాగులను చెక్ చేయగా.. రూ.2 కోట్ల నగదు లభ్యమైంది. జయభేరీ గ్రూప్ ఉద్యోగులైన వీరిద్దరూ రాజమండ్రిలోని యలమంచిలి మురళీకృష్ణకు ఇచ్చేందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. ఆయన నుంచి ఎంపీ మురళీ మోహన్‌కు అందజేస్తామన్నారు. ఈ కేసులో నిమ్మలూరి శ్రీహరి, పండరి, జగన్, ధర్మరాజు, మురళీకృష్ణ, ఎంపీ మురళీ మోహన్‌లపై కేసులు నమోదు చేశాం’ అని సజ్జనార్ మీడియాకు తెలిపారు.