యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
యాక్టర్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీలో యాక్టర్లు లేరా? అని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే జగన్ కు భయమని చెప్పారు. పలు కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తిని వెంటపెట్టుకుని జగన్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు... అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అన్నారు. దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే... పులివెందులకు వెళ్లాలని సూచించారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో ప్రచారం సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో జనసేన లోక్ సభ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ, విశాఖ ఉత్తరం అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు మతగ్రంథాలపై, భగవంతుడి ఆలయాలపై ఒట్లు వేయించుకుని డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. అక్రమ పద్ధతుల్లోనే ఈ డబ్బును సంపాదించారని అన్నారు. ఈ డబ్బులు పంచడం ద్వారా వైసీపీ, టీడీపీ నేతలు పాపాలను కడుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారుపవన్ కల్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదనీ, ఓ వ్యవస్థ అని ఆయన తెలిపారు. విశాఖ ఉత్తరం ప్రాంతంలో తీవ్రమైన కాలుష్యం ఉందనీ, కానీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పం జనసేన పార్టీకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాగూ గెలవదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హరిబాబు, విష్ణుకుమార్ రాజులు కనిపిస్తే తన తరఫున నమస్కారం చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకు ఇంకో పదేళ్లయినా ప్రజలు క్షమించరన్నారు. భూములు కబ్జాలు చేసే వ్యక్తులను జైల్లో పెట్టిస్తామని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు విశాఖలో గెలిస్తే గూండాయిజం, రౌడీయిజం చేస్తారనీ, భూకబ్జాలకు పాల్పడుతారని పవన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలను గెలిపిస్తే వాళ్లు ఇప్పటికే ఈ కబ్జాలను చేతల్లో చేసి చూపారని దుయ్యబట్టారు. గంటా శ్రీనివాసరావు వంటి వ్యక్తులు భూములను కబ్జా చేసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.