యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రం కేరళ నుంచి లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం (ఏప్రిల్ 4) ఉదయం వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. రాహుల్ వెంట ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం రాహుల్ బుధవారం సాయంత్రమే కోజికోడ్ వెళ్లారు. గురువారం ఉదయం వయనాడ్ చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. దక్షిణాది నుంచి పోటీ చేయాలనే పార్టీ నేతల డిమాండ్ మేరకు రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన యూపీలోని అమేథీతో పాటు వయనాడ్ నుంచి రాహుల్ ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. వయనాడ్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానావాస్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్, ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లపల్లితో రాహుల్ తలపడనున్నారు. మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ.. గతంలో తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులు తనను ఓడిస్తారనే భయంతోనే రాహుల్.. దక్షిణాది రాష్ట్రం కేరళ నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే వివరణ ఇచ్చిన రాహుల్.. తాజాగా నామినేషన్ వేశాక మరోసారి స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశమంతా ఒక్కటే అని చాటి చెప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తమను శత్రువులా చూస్తున్నట్లు దక్షిణాది ప్రజలు భావిస్తున్నారని.. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే భావన దక్షిణాది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని రాహుల్ చెప్పారు. ఈ అంతరాన్ని చెరిపేయడానికే తాను వయనాడ్ నుంచి బరిలోకి దిగినట్లు వివరించారు.ప్రధాని మోదీ తమను శత్రువులా చూస్తున్నారని దక్షిణాది ప్రజలు భావిస్తున్నారు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవట్లేదని ఆవేదన పడుతున్నారు. వారికి నేను అండగా ఉంటా.. ఆ సందేశాన్ని ప్రజలకు తెలిపేందుకే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని.. విభజన రాజకీయాలకు పాల్పడుతోందని రాహుల్ ధ్వజమెత్తారు. ఐక్య భారతాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ పని చేస్తోందని తెలిపారు.