ఎన్నికల వేళ ధనం, మద్య ప్రవాహానికి కొదవే ఉండదు. ఈ అక్రమాలపై దృష్టిపెట్టిన ఎన్నికల అధికారులు దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి వేల కోట్ల రూపాయాల నగదు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ. 1550 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో రూ. 377.511 కోట్ల నగదు, రూ. 157 కోట్ల విలువైన మద్యం, రూ. 705కోట్లు విలువజేసే మాదకద్రవ్యాలు, రూ. 312కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఓ భాజపా అభ్యర్థి కుమారుడి నుంచి రూ. 1.80కోట్ల అక్రమ నగదును అధికారులు జప్తు చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో కారు డోర్లలో దాచి పెట్టిన రూ. 2.10కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.