రాజకీయాల్లో ఇప్పుడన్నీ బహిరంగ రహస్యమే. దాపరికాలు ఏమీ లేవు. మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు అంచనాలున్నాయి. నేషనల్ పాలిటిక్స్ లో ఎవరు గొప్ప అన్నది తేల్చుకోవాలని ఉబలాటపడుతున్నారు కేసీఆర్, చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఎఫెక్టు అసెంబ్లీ ఎలక్షన్స్ పై పడకుండా కేసీఆర్ తెలివైన ఎత్తుగడ వేశారు. ఎలాగూ తనకు కొంత వెసులుబాటు ఉంది కాబట్టి జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. హిందీ భాషతో పాటు ఇంగ్లిషులోనూ ఆకట్టుకునే వాగ్ధాటి ఉంది కాబట్టి తనను మమతతోపాటు ఉత్తరాది ప్రాంతీయపార్టీల అధినేతలు ప్రచారానికి ఆహ్వానిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. కానీ అటువంటి సంకేతాలు వెలువడటం లేదు. పైపెచ్చు కేసీఆర్ కౌంటర్ పార్టు చంద్రబాబు నాయుడి చుట్టూచేరుతున్నారు జాతీయస్థాయి ప్రముఖులు. ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న క్రెడిబిలిటీ తేడాకు ఇది అద్దం పడుతోంది. ఎంతైనా జాతీయస్థాయిలో చంద్రబాబు గతంలో కీలకపాత్ర పోషించారు. అందులోనూ మోడీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే ముద్ర కేసీఆర్ పై పడింది.ఎన్నికల ఖర్చు మొదలు అధికారయంత్రాంగంలో ఎవరైతే తమ పార్టీకి సహకరించే అవకాశాలున్నాయో అధినేతలకూ తెలుసు. అందుకే తమకు ఇబ్బందికరంగా మారుతారని భావించిన అధికారులను మార్చాలంటూ ఎన్నికల కమిషన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి కొన్ని పార్టీలు. కమిషన్ సహకరించి పక్షపాతంతో వ్యవహరించే అధికారులను బదిలీ చేస్తే కుదరదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకూ వెనకాడటం లేదు అధికారపార్టీలు. తద్వారా ప్రభుత్వయంత్రాంగమూ పక్షపాతంతో పనిచేస్తుందని అధికార,ప్రతిపక్షపార్టీలు ప్రజలకు చాటి చెబుతున్నాయి. ఇక రాజకీయ అవగాహనల సంగతి చెప్పనక్కర్లేదు. తమకు నేరుగా సంబంధం లేని రాష్ట్రాల్లో సైతం పొరుగు రాష్ట్రం పార్టీలు, ప్రభుత్వాలు వేళ్లు పెడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో రగులుతున్న వివాదాలే ఇందుకు తార్కాణం.మోడీ, కేసీఆర్ లు రహస్య స్నేహితులంటూ రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు హైకోర్టు విభజన వరకూ మోడీ సహకారంతోనే కేసీఆర్ అనుకున్నవి అనుకున్న టైమ్ లో చేయగలిగారనేది టీఆర్ఎస్ వర్గాలు సైతం అంగీకరించే నిజం. అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ లు తనకు శ్రేయోభిలాషులంటూ జగన్ ప్రకటించారు. ఇందులోనూ వింతేమీ లేదు. జగన్ దాచిపెట్టిన రహస్యం గురించి కూడా ప్రజలకు తెలుసు. తెలంగాణలో వ్యాపార,ఆర్థిక కార్యకలాపాలు, ఆస్తులు ఉన్నవారిని వైసీపీ వైపు మళ్లించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. దానిపై అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ వివరణ ఇవ్వలేకపోయాయి. మౌనం అర్ధాంగీకారం. అంటే పరోక్షంగా అంగీకరించినట్లే . అలాగే కాంగ్రెసుతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు లేకపోయినప్పటికీ తెలంగాణలో హస్తానికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తోంది. జాతీయంగానూ సై అంటోంది. కానీ కలిసి నడవదు. ఇదంతా రాజకీయాల్లో పెద్ద విచిత్రం కాదు. కాంగ్రెసు పార్టీకి ఏపీలో రెండు మూడు సీట్లలో సహకరిస్తే చాలు. వైసీపీ ఓట్ల చీలికకు హస్తం పార్టీ తోడ్పడుతుందని తెలుగుదేశం భావిస్తోంది. రహస్య స్నేహంలోని లాభమిదే.చంద్రబాబు నాయుడు పెద్దగా కాంగ్రెసు ప్రస్తావన తీసుకురారు. రాహుల్ గాంధీతో కలిసి గతంలో తెలంగాణలో బహిరంగసభల్లో పాల్గొన్నారు. పత్రికా విలేఖరుల సమావేశాల్లోనూ మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికొచ్చేసరికి వ్యూహాత్మకంగా దాటవేస్తున్నారు. పొరుగురాష్ట్రాల్లో తెలిసి ఉన్న పార్టీలకు మాత్రం కాంగ్రెసును రికమెండ్ చేస్తుంటారు. హస్తంతో పొత్తు మంచిదని సూచిస్తుంటారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మోడీకి సంబంధించిన అంశాలను పెద్దగా ఎన్నికల ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి బీజేపీనే కారణమనే వాస్తవాన్ని ప్రజలముందు అంగీకరించడానికి ఇష్టపడదు. ఇప్పటికే బీజేపీకి, వైసీపీకి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయాన్ని టీడీపీ బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఇది వైసీపీకి అపాయకరం. అందుకే అందరికీ తెలిసిన విషయమే అయినా మొహమాటానికి కూడా నిజాన్ని ఒప్పుకోవడానికి జగన్ ముందుకురారు. ఇలా తమకు పరోక్షంగా సహకరించేవారిని ఉపేక్షించి చెప్పకనే తమ మైత్రిని చాటుకుంటున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో సెంటిమెంటు రగులుతోందని గ్రహించి వైసీపీతో సంబంధాలున్నప్పటికీ కేసీఆర్ ప్రస్తుతానికి మౌనముద్ర ధరించారు.దాంతో బహిరంగంగా, పరోక్షంగా మిత్రులను కూడగట్టడం టీఆర్ఎస్ కు సాధ్యం కావడం లేదు. ఫలితంగానే జాతీయంగా ఆయన ప్రభావం చూపలేకపోతున్నారు.